అక్రమార్కులపై ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కాలేజీని అధికారులు సీజ్ చేశారు. ఈ సంఘటన కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు కొనసాగిస్తున్న పట్టణంలోని రాజుకాలనీలో గల శ్రీచైతన్య బ్రాంచిని మంగళవారం మండల విద్యాశాఖాధికారి రామక్రిష్ణమూర్తి సీజ్‌ చేశారు. విద్యాశాఖ అనుమతులు లేకుండా భవనం పూర్తి చేయకుండా అడ్మిషన్‌లు చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎంఈవో రామక్రిష్ణమూర్తి శ్రీచైతన్య పాఠశాల బ్రాంచి-3ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 అక్కడున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను బయటకు పంపి తాళం వేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంతవరకు అడ్మిషన్లు చేపట్టడం గానీ, తరగతులు నిర్వహించడం గానీ చేపట్టకూడదంటూ ప్రిన్సిపాల్‌ చేత రాతపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.