విశాఖపట్నం: విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పట్టుబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ పై పోటీ చేసిన ఆయన ఓటమి దాదాపుగా ఖరారైందనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. 

శ్రీభరత్ టీడీపికి దూరమైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో మామగారైన హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కూడా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బాలకృష్ణ చిన్నల్లుడైన శ్రీభరత్ కు విశాఖపట్నం లోకసభ సీటు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఇష్టపడలేదు. అయితే, బాలకృష్ణ ఒత్తిడికి తలొగ్గి ఆయన టికెట్ ఖరారు చేశారని అంటారు. 

అయితే, రాత్రికి రాత్రి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ విశాఖపట్నం జనసేన అభ్యర్థిగా తెర మీదికి వచ్చారు. చంద్రబాబు అర్థరాత్రి చర్చలు జరిపి వీవీ లక్ష్మినారాయణను పోటీకి దించారనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. అయితే, అందులో ఎంత వరకు నిజం ఉందని చెప్పలేం గానీ శ్రీభరత్ కూడా ఆ ప్రచారాన్ని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. 

వీవీ లక్ష్మినారాయణ ఓటేయాలని చంద్రబాబు విశాఖపట్నం ఓటర్లకు ఫీలర్లు పంపినట్లు చెబుతున్నారు. బాలకృష్ణ పెద్దల్లుడైన నారా లోకేష్ కూడా వీవీ లక్ష్మినారాయణను గెలిపించాలని ఫోన్లు చేసి మరీ చెప్పారని అంటున్నారు. దాంతో టీడీపి శ్రేణులు మొత్తం వీవీ లక్ష్మినారాయణకు మద్దతు పలికారని, విశాఖపట్నం లోకసభ స్థానంలో పెద్ద యెత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. 

ఈ స్థితిలో శ్రీభరత్ టీడీపికి పూర్తిగా దూరమైనట్లు ప్రచారం సాగుతోంది. నారా వారి కుటుంబానికి కూడా ఆయన దూరం జరిగినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణతో కూడా ఆయన ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ కుటుంబ కార్యక్రమానికి కూడా శ్రీభరత్ హాజరు కాలేదని అంటున్నారు. మొత్తం మీద, శ్రీభరత్ కు రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని మొగ్గలోనే తుంచివేశారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.