- జాన్‌సన్ చోరగుడి

యువ ముఖ్య మంత్రి కావడం వల్లనేమో తొలి ఏడాది వై.ఎస్. జగన్మోహన రెడ్డి (జగన్) పరిపాలన ‘రోడ్ మ్యాప్’ ను సాంప్రదాయ విమర్శకులు విశ్లేషకులు పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. ఇప్పటి భాషలో చెప్పాలంటే వారు దాన్ని ‘లైట్’ తీసుకుని, సంక్షేమ పధకాల జాబితా మాత్రం ఏదో పై పైన వల్లెవేసి... వాటికి తమ వ్యాఖ్యలు ఏవో కొంత జోడించి సరిపెట్టారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సి.ఎం. గత అరవై ఏళ్ల రాష్ట్ర చరిత్రలోను, ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ అందరికంటే చిన్నవారు. దాంతో తొలి ఏడాది సమీక్షలో వారు ఆయన్ని అంతగా పట్టించుకోలేదు. అంటే, అలాగని విశ్లేషకులు ఆయన్ని విస్మరించారు అని కాదు. జగన్ పరిపాలన మొదటి సంవత్సరం ముగిసిన 2020 జూన్ నాటికి, వారంతా తొలి ఏడాది పాలనా మీద విస్త్రుతంగానే సమీక్షలు మదింపులు చేసారు. అయితే, వారు తమ వద్ద ఉన్న పాత తూనిక రాళ్ళతో ఆయన్ని తూకం వేసి, ‘ఇప్పటికిప్పుడు వెంటనే చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు...’ అన్నట్టుగా తమ ముగింపులు  ఇచ్చారు. మరి వాళ్ళు ఎప్పుడు చెబుతారో తెలియదు. దాంతో ఇప్పుడు మనవద్ద చురుగ్గా ఉండే విశ్లేషకులను కూడా మనం గమనంలో ఉంచుకోవలసిన అవసరం ఉన్న సంగతి స్పష్టమైంది. ఇక రాజకీయ కారణాలతో విమర్శలను చేసేవారిని ఇందులో కలపలేదు.   

 

 

ఉద్దేశ్య పూర్వకమా కాదో తెలియదు కానీ వీరు చేసిన ఈ తొలి ఏడాది మదింపులో రెండు ప్రధాన అంశాలు కనిపించలేదు. ఒకటి – ఐదేళ్ళ క్రితం రాష్ట్రం విభజించబడిన దరిమిలా (కొత్త జాగ్రఫీ పరిధుల్లో) ప్రభుత్వాలు వాటి పరిపాలనను మనం మదింపు చేయాలి, అనే ఎరుకతో వీరు చేసిన ఈ కసరత్తు జరగలేదు. రెండవది – మొదటి ఏడాది పరిపాలన సమీక్షలో ఇరువురి (రెండు పార్టీల) ప్రభుత్వాల పరిపాలనల మధ్య  ఏ విషయంగాను తులనాత్మక విశ్లేషణ జరగలేదు.

పోనీ తాము అలా చేయకపోవడానికి సహేతుకమైన కారణాలు కూడా వాళ్ళు ఎవరూ చెప్పలేదు. కనుక, వారు దాన్ని కావాలనే చేసినట్టు అనుకోవాల్సి వుంటుంది. ఈ రెండు అంశాలు చూసాక అనిపిస్తున్నది, మనవద్ద ఇంకా లోతైన అధ్యయనంతో మౌలిక అంశాలు స్పృశించే స్థాయిలో ప్రభుత్వాల పనితీరును విశ్లేషించే యంత్రాంగం అవసరమని; ఈ పనికి పూనుకునేవారు ఇకముందు ఇది మెరుగైన పౌరసమాజం కోసం చేస్తున్న ‘సోషల్ ఆడిట్’ అనుకుంటే తప్ప అది జరగదు. ఇటువంటి సందర్భాల్లో జరిగే కసరత్తు ఇప్పటి ‘నెట్ జెనరేషన్’ కు నేరుగా ‘కనెక్ట్’ కనుక కాకపోతే, సాంప్రదాయ ధోరణి విశ్లేషణలు పేలవం అవుతాయి, వాటి ‘షెల్ఫ్ లైఫ్’ తగ్గుతుంది.   

 

 

జగన్మోహన రెడ్డి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు. ఐదేళ్ళ క్రితం 2014 లో జరిగిన ఎన్నికలు నాటికి రాష్ట్రం విడిపోలేదు, రాష్ట్రపతి పరిపాలనా కాలంలో ఆ ఏడాది జూన్ రెండున రాష్ట్ర విభజన జరిగితే, ఎనిమిదిన చెంద్రబాబు హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసారు. అందుకోసం కొద్ది మంది అధికారులు అక్కణ్ణించి ఇక్కడికి వచ్చి, ఆ ఏర్పాట్లు చూసుకుని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. విభజన చట్టం ప్రకారం జగన్ ‘టర్మ్’ కూడా 2024 వరకు ఏ.పి. రాజధాని హైదరాబాద్ గానే ఉండాల్సింది. కానీ తొలి ఏడాది తర్వాత బాబు దాన్ని 2015 లో విజయవాడకు మార్చడంతో, జగన్ కు ఇప్పుడు తన పని సుళువు అయింది.

 

 

ఈ పూర్వ రంగంలో మొదటి ఏడాదిలో రెండు ప్రభుత్వాలను వాటి పని తీరును చూసినప్పుడు, మనకు ప్రతిదీ మరింత దగ్గరగా స్పష్టంగా కనిపిస్తున్నది. పోనీ మొదటి ఏడాది హైదరాబాద్ నుంచి ఇక్కడి రావడానికి గానీ ఆంధ్ర – తెలంగాణా రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు ఉద్యోగుల పంపకాలకు సరిపోయింది అనుకున్నప్పటికీ... రెండు, లేదా మూడు, లేదా నాలుగవ, ఏడాదిలో బాబు పరిపాలనను జగన్ తొలి ఏడాది పరిపాలనా ‘టర్నోవర్’ తో పోల్చవచ్చా? సమాధానాలు వెతక వలసిన ప్రశ్న ఇది.

సరే ఎటూ అక్కణ్ణించి ఇవతలకు వచ్చేసాము, ఇక్కడి తాత్కాలిక సచివాలయ భవనాలు కట్టుకుని వాటిలో చేరిపోయాము. దీంతో వొక దశ పూర్తి అయింది. ఇక శాశ్విత భవనాలు అంటే అది మనచేతిలో పని కనుక అవి ఎప్పుడయినా కట్టుకోవచ్చు. మూడు నాలుగవ ఏడాది నాటికి కొత్త రాష్ట్రంలో ప్రాంతాల వారిగా జిల్లాలు వారీగా మనకు వున్న వనరుల బలాలు బలహీనతలు గుర్తించి సమగ్ర రాష్ట్ర అభివృద్దికి ‘మైక్రో ప్లానింగ్’ మొదలవ్వాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఐదో ఏడు కోసం సిద్దమవ్వాలి, కానీ అటువంటిది జరగలేదు.

 

 

ఆర్ధిక సంస్కరణల తర్వాత గడచిన పాతికేళ్లలో ప్రభుత్వ పరిపాలనలోకి భిన్న రూపాల్లో చొచ్చుకొచ్చిన ప్రైవేట్ రంగం, లాభార్జనే లక్ష్యమయిన దాని ‘ప్లేయర్ల’ దూకుడు మనకు తెలిసిందే. అవిప్పుడు ఎన్నికయిన ప్రభుత్వాలను భిన్నరూపాల్లో తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. దీన్ని చట్టపరిధిలో నిలువరించడానికి ‘బ్యురోక్రసీ’ కి అదనపు అధికారాల పదును, అదనపు సిబ్బంది దన్ను అవసరం. అయితే మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికయిన తొలి ప్రభుత్వం తమను ఎన్నుకొంటున్న ప్రజల పట్ల జవాబుదారీతనంతో చట్టసభల్లో శాసనాల ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి మొదటి ఐదేళ్ళను ప్రభావవంతంగా వినియోగించుకోగలిగిందా? ఇందుకు సంతృప్తికరమైన సమాధానం మనకు దొరకదు.

ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక, తొంభై దశకం మధ్యలో మనం ‘గుడ్ గవర్నెస్’ అన్నాము. అందుకు - ‘గ్యాప్స్’ ను గుర్తించడం ‘ఫిల్పరేజ్’ని ఆపడానికి కారణమవుతున్న పాత చట్టాలను సవరించి వాటిని ఆధునీకరించడం అవసరం. రాష్ట్ర విభజన జరిగి రాజ్యపాలనా పరిధి మునుపటి 23 జిల్లాల విస్తృతి నుంచి 13 జిల్లాలకు తగ్గినప్పుడు, గతంలో పరిపాలనా అనుభవం ఉన్నవారు ఎవరైనా మొదటి ఐదేళ్ళలో చేయవలసింది ఏమిటి? ఇప్పటి పరిస్థితులను బట్టి కొత్త రాష్ట్ర అవసరాలకు తగిన పరిపాలనా సంస్కరణలు ముందుగా అమలులోకి తీసుకుని రావాలి. ఎందుకంటే, ఎన్నికయిన ప్రభుత్వాలను తమ ‘బ్యాక్ సీట్ డ్రైవింగ్’ తో నియంత్రించే ప్రభుత్వేతర శక్తులు ఎప్పుడూ కాచుకుని ఉంటాయి.

 

 

అది - ‘ట్యాక్స్ పేయర్స్ మనీ...’ అని తరుచు ‘క్లెయిం’ చేస్తూ ప్రభుత్వ వ్యయాన్ని ‘సోషల్ ఆడిట్’ చేసే శిష్ఠవర్గాలు, ఎన్నికయిన ప్రభుత్వాలు ‘సంక్షేమం’ పేరుతో పేదలకు కోసం ఏవో కొన్ని కంటితుడుపు చర్యలు చేస్తే చాలని, రాజ్యం అంతిమ లక్ష్యం ఎప్పుడూ తమ వర్గ ప్రయోజనాలకు పూర్తి భద్రత కల్పించాలని కోరుకుంటాయి. రాజ్యంలో కీలకమైన విధాన నిర్ణయాక యంత్రాంగంలో గానీ, లేదా ఏదో వొక ‘ఛాంబర్స్’ పేరుతో రాజ్యం బయట ‘ప్రెషర్ గ్రూప్స్’ గా కానీ అక్కడ కూడా వీరే క్రియాశీలంగా ఉంటారు. అది ఏ ప్రభుత్వం అయినా అవి ఎలా మొదలయినా, వాటి ముగింపులు మాత్రం ఎక్కువసార్లు వారు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. అలాగే ఏళ్ళు పూళ్ళు గడుస్తుంటాయి... కొన్ని ‘ఖాళీలు’ మాత్రం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాయి (అవి అలాగే ఉండాలని కోరుకుంటారు కనుక) ఫలితం ఏమిటి? నీళ్ళు కనిపిస్తూనే ఉంటాయి, కానీ బావిలో నుంచి చిల్లు బకెట్ తో తోడి తొట్టె నింపుతున్న చందంగానే ఈ ప్రహసనం సాగుతూ ఉంటుంది.

అయితే, జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ‘టేక్ ఆఫ్’ చూస్తుంటే, మొట్టమొదటి సారి గడచిన అరవై ఏళ్ల ‘పాలిటీ’ ఇన్నాళ్ళు వదులుతూ వెళ్ళిన ‘డాట్స్’ ను కలుపుకుంటూ వెళుతున్న ప్రయత్నం కనిపిస్తున్నది. గడచిన ఏడాదిలో సంక్షేమం, విద్య, వైద్యం, అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, చట్టాల అమలు - నిఘా యంత్రాంగం, వీటన్నిటి నుంచి సూక్ష్మస్థాయిలో ఫలితాలను ఈ ప్రభుత్వం ఆశిస్తున్నది. ఎన్నికయిన ఏ ప్రభుత్వ నేతలయినా మాట మాత్రంగానో లేదా వాగ్ధానాలుగానో తమ ఎన్నిక మేనిఫెస్టోలో ఇవి చెబుతుంటారు.

 

 

అయితే, జగన్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రతి దిద్దుబాటు చర్యతో పాటుగా అందుకు అవసరమైన సిబ్బంది, అధికారుల నియామకానికి కొత్త పోస్టులను కూడా మంజూరు చేయడం వద్ద ఈ ప్రభుత్వ నిజాయితీ అర్ధమవుతున్నది. ఇది మాటల సర్కార్ కాదని స్పష్టమవుతున్నది. అన్నింటినీ మించి, ఆయా ప్రభుత్వ శాఖల పనులు క్షేత్రస్థాయిలో ‘గ్రౌండింగ్’ కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల, ఎన్టీఅర్ నలభై ఏళ్ల క్రితం ఆశించిన గ్రామ పరిపాలనా వ్యవస్థలోని సాంప్రదాయ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనై  అదిప్పుడు నేరుగా బహుజన వర్గాల (‘హేట్రోజినియస్’) పరమయింది. జాతీయ దృష్టితో దీని లోతుల్లోకి చూసినప్పుడు, నాటి మండల్ కమీషన్ స్పూర్తికి మరో అదనపు విస్తరణ కూడా ఇప్పుడు ఏ.పి.లో కనిపిస్తుస్తున్నది.

 

 

గడచిన ఏడాదిలో పనిలోకి దిగిన గ్రామ సచివాలయాలు, ‘దిశ’ చట్టం దాని అమలుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవి రెండు ఇప్పటికే సూక్ష స్థాయిలోకి జనంలోకి చొచ్చుకు పోయాయి. మొత్తంగా చూసినప్పుడు వొక సామాజిక న్యాయం దిశలో ప్రభుత్వం అడుగులు పడుతున్న తీరు ఇప్పటికే అర్ధమవుతున్నది. జగన్మోహన రెడ్డి ఏ అంశాన్ని సమీక్షకు తీసుకున్నా దాని మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెతకడం ఆశాజనకంగా కనిపిస్తున్న అంశం. అందుకు – పరిశ్రమల కాలుష్య వ్యర్ధాల ‘డిస్పోజల్’ కోసం ఏ.పి. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పోరేషన్, మానవ వనరుల అభివృద్దికి ‘స్కిల్ డెవలప్మెంట్’ చొరవ, తీరాంధ్ర అవసరాల కోసం ‘ఆక్వా’ పాలసీ, ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం భూమిపై గిరిజనుల యాజమాన్య హక్కులు, కొత్తగా ఆరు ఫిషింగ్ హార్బర్లు, వ్యవసాయం – మార్కెట్ అనుసంధానం కోసం ‘రైతు భరోసా కేంద్రాలు’, ముసాయిదా దశలో ఉన్న పారిశ్రామిక పాలసీ, ఇవన్నీ సుదీర్ఘ జాబితాలో కొన్ని మాత్రమే. జగన్మోహన రెడ్డి ఏ అంశాన్ని సమీక్షకు తీసుకున్నా దాని మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెతుకుతున్నారు అనే వ్యాఖ్యకు ఈ వ్యాసం ముగింపులో అటువంటివి రెండు అంశాలు చూద్దాం....

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్

ముఖ్యమంత్రిగా తొలి ఏడాది ముగిసాక జూన్ 12 న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ పేరుతో ఒక కొత్త విభాగాన్ని(హెచ్.వో.డి.) నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక శాఖ పరిధిలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి పర్యవేక్షణలో పనిచేసే ఈ విభాగం కమర్షియల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, జి.ఎస్టీ., ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, మైనింగ్ రాయల్టీ వంటి పన్ను ఎగవేతల మీద నిరంతర నిఘా ఇక ముందు ఉంటుంది. చట్టబద్దంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు నిఘా కొరవడి ఎగవేతల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతున్నది. ఆధునిక నిఘా యంత్రాంగంతో ఈ విభాగం పనిచేస్తూ ఆయా శాఖల రెవెన్యూ పెరుగుదలకు ఇది దోహదపడుతుంది. ఇందుకోసం 55 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సరిహద్దు రాష్ట్రాలలోని రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగాలతో సమన్వయంతో ఇవి పనిచేస్తాయి. మొదటి ఏడాదిలోనే ఈ ప్రభుత్వం చేసిన ఇటువంటి పరిపాలనా సంస్కరణ వల్ల ఇకముందు ‘ట్యాక్స్ పేయర్’ చట్టానికి లోబడి పనిచేయాలి అనే అప్రమత్తతకు ఇకముందు రాక తప్పదు. ఇందువల్ల చట్టాల పట్ల అప్రమత్తత, న్యాయస్థానాల విలువ కూడా పౌరసమాజంలో పెరుగుతుంది. 

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (లిక్కర్ & స్యాండ్)

సాధారణ పరిపాలనా శాఖ (జి.ఏ.డి) పరిధిలో ఉండే ఈ కమీషనరేట్ కార్యాలయానికి డి.జి.పి. ఎక్స్-అఫీషియో ప్రిన్సిపాల్ సెక్రటరీగా, ఇనస్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి రాష్ట్ర స్థాయిలో హెచ్.వో.డి. గా ఉంటారు. ప్రతి జిల్లాలో వొక ఎడిషినల్ ఎస్పీ లేదా అసిస్టెంట్ ఎస్పీ ఉంటారు. మొత్తం 13 జిల్లాలు కాకుండా నగరాల్లో పోలీస్ కమీషనరేట్లు కూడా కలిసి 18 కార్యాలయాలు వాటి విస్తృతిని బట్టి 20 -30 మంది ఇతర సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీ లతో సమన్వయంతో వీళ్ళు పనిచేస్తారు. వెంటనే పోస్టుల భర్తీ జరిగి వీరు విధుల్లో చేరడంతో, అక్రమ ఇసుక రవాణా మద్యం అక్రమ రవాణా మీద ఇప్పటికే ఈ బ్యూరో నిఘా పెట్టడంతో ప్రతి రోజు వార్తల్లో కనిపించడం చూస్తూనే ఉన్నాం. కాపుసారా వ్యాపార ప్రయోజనాలు ఆధిపత్య శక్తులవి అయినప్పటికీ, దాని తయారీ కారణంగా సారా బట్టీల వద్ద పోలీస్ కేసులు అయినా, కాపు సారా వినియోగం వల్ల జరిగే ఆరోగ్య లేదా ప్రాణ హాని అయినా ఎవరిని నేరుగా తాకుతుందో వేరుగా చెప్పనక్కర్లేదు. అటువంటి చీకటి వ్యాపార సామ్రాజ్యం మీద ఈ ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి ఇటువంటి బ్యూరోతో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం సిద్దమయింది. ఎన్నికల ముందు గెలిస్తే మధ్య నిషేధం అమలులోకి తెస్తాం... అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇంత ‘సీరియస్’ గా దీన్ని తీసుకుంటుంది అని ఎవ్వరూ అనుకోలేదు. మునుపటి ‘మధ్యనిషేదాలు’ వంటివే ఇది కూడా అనుకున్నారు.

 

 

జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తున్న ఈ ధోరణి, అందులో అంతర్లీనంగా పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించాలి అనే యావ, ఆయన ఏడాది పాలన పై జరిగిన విశ్లేషణలో కనిపించలేదు. ఏడాది తిరిగి వచ్చేసరికి ఏ.పి. లో 25 కొత్త జిల్లాల ప్రతిపాదన, తండ్రి వై ఎస్. పుట్టిన రోజు జులై ఎనిమిదిన 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ ఈ ప్రభుత్వ వేగానికి పరాకాష్ట. అయితే, ఇండియా – చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జూన్ 20 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ - ‘యువ సి.ఎం.’ మాట్లాడిన తీరు విషయంలోని పరిపక్వత దార్శనికత చూసాక, ఈ ప్రభుత్వం గురించి మునుపటి తమ అభిప్రాయాల్ని మార్చుకుంటున్నవారు ఇప్పట్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం జరగక పోవచ్చు.  

ఫోటోలు: సి.జే. బాబు