Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం.. పూర్తి వివరాలు ఇవే..!!

రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు.

special medical team for chandrababu naidu in rajahmundry Jail ksm
Author
First Published Sep 16, 2023, 10:11 AM IST

రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మందితో వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వైద్యుల బృందంలోని ముగ్గురు రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి చెందిన వారని తెలుస్తోంది. వీరు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నియంత్రణలో ఉంటారు. మరో ఇద్దరు వైద్యులు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో పనిచేసేవారు. 

అంతేకాకుండా రెండు యూనిట్ల ‘‘O’’ పాజిటివ్ రక్తం నిత్యం అందుబాటులో ఉంచాలని కూడా వైద్యశాఖ ఆదేశించింది. అలాగే అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది. అయితే చంద్రబాబుకు ఆకస్మాత్తుగా  ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలాఉంటే, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సంబంధించి అధికారులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం.. ఇంచార్జ్‌గా కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించడం కూడా పెద్ద చర్చకే దారితీసింది. 

ఈ క్రమంలో జైళ్ల శాఖ స్పందించింది. రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో వున్నారని.. ఆమె నిన్న ఉదయం ఆసుపత్రిలో చేరారని తెలిపింది. ఆసుపత్రిలో భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారని.. 4 రోజుల సెలవు అభ్యర్ధనను జైళ్ల శాఖ అంగీకరించిందని పేర్కొంది. రాహుల్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని జైళ్ల శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే, జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ భార్య కిరణ్మయి శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే డీఐజీ రవికిరణ్, జిల్లా ఎస్పీ జగదీష్, ఇతర జైలు ఉన్నతాధికారులు ఆస్పత్రికి వెళ్లి రాహుల్‌ను పరామర్శించారు. రాహుల్ భార్య కిరణ్మయి మరణం పట్ల అధికారులు సంతాపాన్ని తెలియజేశారు. అయితే మీడియా వక్రీకరించి వార్తలు రాయొద్దని అధికారులు కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios