దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాక్సినేషన్ ఒక్కటే కోవిడ్‌కు మందని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా టీకాల కొరత వేధిస్తోంది.

తొలి నాళ్లలో అపోహల కారణంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడిన జనం.. ఇప్పుడు కరోనా తీవ్రత నేపథ్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత టీకా వేసుకున్న వైద్య సిబ్బందికి రెండో డోసు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం జగన్‌ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే సెకండ్ డోస్ ప్రక్రియ మొత్తాన్ని యాప్‌ ద్వారా పర్యవేక్షించనుంది సర్కార్.

Also Read:కరోనా ఎఫెక్ట్: రెండు రోజుల్లో ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి

సోమవారం నుంచి ఈ యాప్ ప్రభుత్వ వర్గాలకు అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఈ యాప్‌లో పొందుపర్చనున్నారు.

రిజిస్ట్రేషన్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, పేరు ద్వారా ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తుంది. ఈ నెల 20 నాటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.