విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపార వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్ చిగురుపాటి జయరామ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక చూసి పోలీసులు నివ్వెరపోయారు. జయరామ్ పోస్ట్ మార్టం కంటే 24 గంటలు ముందే హత్యకు గురైనట్లు నివేదికలో రావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. 

నందిగామ వద్దే హత్య జరిగి ఉంటుందని భావించిన పోలీసులకు ఈ రిపోర్ట్ ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ చేసింది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి పలు కీలక విషయాలు వెల్లడించారు. జయరామ్ పోస్టుమార్టంకి 24 గంటలకు ముందు హత్య చేయబడ్డారని పోస్ట్ మార్టం నివేదికలో వచ్చిందని తెలిపారు. 

హత్య జనవరి 31 మధ్యాహ్నం జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోనే జయరామ్ ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం విజయవాడ వరకు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు రెండు కార్లు వినియోగించారని తెలిపారు. 

అయితే నందిగామ ఐతవరం వద్ద జాతీయ రహదారి పక్కన మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారని తెలిపారు. అయితే స్టీరింగ్ పై వేలిముద్రలు పడకుండా ఉండేందుకు నిందితులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. స్టీరింగ్ పై ఉన్న వేలిముద్రలు, జయరామ్ వేలిముద్రలు మ్యాచ్ అవుతున్నట్లు తెలిపారు. 

నిందితులు ఎవరు అనేది అంతుచిక్కడం లేదన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే 10 బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరితోపాటు మరికొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ త్రిపాఠి ధీమా వ్యక్తం చేశారు.