విశాఖపట్నం: ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ వ్యాపించాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ రుతుపవనాలు మరింత ముందుకు కదిలే సానుకూల పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇప్పటికే రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు శుక్రవారమే ప్రవేశించినట్టు ఐఎండీ పేర్కొంది.

read more  పొంచివున్న మరో తుఫాను... తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇక తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దాన్ని ఆవరించి తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్లు...నేటి రాత్రికల్లా అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ ఈనెల 24 నాటికి తుపానుగా... అనంతరం అతి తీవ్ర తుపానుగా మారుతుందన్నారు.  అనంతరం ఉత్తర వాయవ్యంగానే కొనసాగుతూ పెను తుపానుగా మారి ఈనెల 26 ఉదయం బెంగాల్- ఒడిషా తీరాలను బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలమీద పరిమితంగా ఉండనుందని తెలిపింది. ఇవాళ(ఆదివారం) తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని... రేపు(సోమవారం) కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగనున్నట్లు తెలిపారు. అలాగే 25,26 తేదీలలో ఒడినుషాను ఆనుకున్న ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చెదురు మదురు జల్లులు పడవచ్చని తెలిపారు. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని...   మత్స్యకారులు నేడు, రేపు వేటకు పోరాదని అధికారులు హెచ్చరించారు.