గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, అపారమైన ఆస్తి నష్టం సంభవించింది.

లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి, అన్నదాతకు తీరని నష్టం కలిగించింది. హైదరాబాద్ నగరం రోజుల తరబడి వరదల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

ఈ క్రమంలో రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అమరావతి  వాతావరణ కేంద్రం తెలిపింది.

రాగల 2 రోజులలో మొత్తం దేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వీటి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం వివరించింది.