చిత్తూరు:తండ్రి మృతిని తట్టుకోలేక కొడుకు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. తండ్రి అంత్యక్రియలకు వస్తూ కొడుకు కూడ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

చిత్తూరు రూరల్ మండలం నల్లవెంకటయ్యగారిపల్లెకు చెందిన ఆంజనేయులనాయుడు అనారోగ్యంతో మంగళవారం నాడు మృతి చెందాడు. ఆయనకు భార్య సరోజమ్మతో పాటు ముగ్గురు కొడుకులున్నారు. వారిలో ఇద్దరు కొడుకులు ఇంటివద్దనే వ్యవసాయం చేసుకొంటున్నారు.

రెండో కొడుకు నీరజాక్షులనాయుడు ఉపాధి కోసం బెంగుళూరుకు వెళ్లాడు. 13 ఏళ్ల నుండి ఆయన అక్కడే ఉంటుున్నాడు. 

తండ్రి మరణించిన విషయం తెలుసుకొన్న కొడుకు కారులో తన కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరాడు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున పలమనేరు అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు అతడిని నిలిపివేశారు. తన తండ్రి చనిపోయినట్టుగా నీరజాక్షులనాయుడు చెప్పాడు. అయితే ఆధారాలు చూపాలని పోలీసులు చెప్పడంతో తండ్రి మృతదేహం ఫోటోను వాట్సాప్ లో పంపాడు. 

ఈ ఫోటోను చూసిన వెంటనే అతను కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించాడు. తీవ్ర ఆవేదనకు గురైన నీరజాక్షులనాయుడు గుండెపోటుకు గురై మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఒకే రోజున తండ్రీ, కొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.