మతిస్థిమితం లేని తండ్రిని పట్టించుకోకుండా... తల్లి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆమె కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. చాలా సార్లు తల్లిని  హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో...  కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు.ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బసవాపల్లె పంచాయతీ రెట్టగుంట గ్రామానికి చెందిన డేవిడ్‌ (52), జ్యోతి(45) దంపతులకు ఇద్దరు పిల్లలు రోజా(25), ప్రేమ్‌కుమార్‌(22) వున్నారు. డేవిడ్‌కు కొన్నేళ్లుగా మతిస్థిమితం లేదు. ఈ నేపథ్యంలో ఆయన భార్య జ్యోతి వరుసకు మరిది అయ్యే సుందర్‌రాజ్‌తో సంబంధం పెట్టుకుందనే అనుమానం కలిగింది.

ఈ విషయంలో తల్లిని చాలాసార్లు హెచ్చరించాడు. అయినా కొడుకు మాటలను ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల విపరీతంగా తాగి వచ్చిన ప్రేమ్ కుమార్... మద్యం మత్తులో కత్తితో తల్లి గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న సుందర్‌రాజ్‌పై కూడా కత్తితో దాడి చేసిన ప్రేమ్‌కుమార్‌ అతడిని కూడా గాయపరిచాడు.

అనంతరం నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా...తల్లి ప్రాణాలు కోల్పోయింది. కొడుకు జైలుకి వెళ్లాడు. పిచ్చివాడైన తండ్రి... ఎవరూ పట్టించుకోక ఊర్లో తిరుగుతుంటే.. పెళ్లి కావాల్సిన రోజా ఇంట్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.