కర్నూల్: రక్తమాంసాలు పంచి ప్రాణంపోసిన కన్నతల్లిపట్లే అత్యంత కర్కషంగా వ్యవహరించాడు ఓ కసాయి కొడుకు. తల్లి అన్న మమకారం లేకున్నా వృద్ధురాలన్న జాలి, దయ కూడా ఆస్తి కోసం చిత్రహింసలకు గురిచేసి చివరకు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఇలా పున్నామ నరకంనుండి కాపాడతాడనుకున్న కొడుకు చేతిలో బ్రతికుండగానే తల్లి నరకం చూసిన విషాద సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామానికి చెందిన పుల్లమ్మ(60)అనే వృద్ధురాలు కొడుకు ప్రసాదరెడ్డి వద్ద వుండేది. భర్త చనిపోవడంతో పెద్దల నుండి వచ్చిన రెండుకరాల వ్యవసాయ పుల్లమ్మ పేరిట వుంది. ఆ భూమిని తన పేరిట రాసివ్వాలని కొడుకు కోరగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో తల్లిపై కోపాన్ని పెంచుకున్న ఈ కసాయి కొడుకు మద్యం మత్తులో అత్యంత కర్కషంగా వ్యవహరించేవాడు.

నిత్యం మద్యం సేవించి తల్లిని చిత్రహింసలకు గురిచేసేవాడు. వృద్ధురాలన్న జాలి లేకుండా సిగరెట్లతో ఒంటిపై కాల్చడం, కర్రలతో చితకబాదడం చేసేవాడు. ఇలా తల్లిని చిత్రహింసలు పెడుతుండగా అడ్డుకునే చుట్టుపక్కల ఇండ్లవారితోనూ ప్రసాద్ రెడ్డి గొడవకు దిగేవాడు. దీంతో అతడిని ఎవ్వరూ అడ్డుకునేవారుకాదు. 

ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఫూటుగా మద్యం సేవించిన ప్రసాదరెడ్డి మరోసారి తల్లిని చితకబాదాడు. ఇంట్లో కనబడిన కర్రలు, ఇతర సామగ్రితో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన పుల్లమ్మ ప్రాణాలు కోల్పోయింది. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.