విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా నరికాడు కసాయి కొడుకు. ఈ దాడిలో తల్లి అక్కడికక్కడే చనిపోగా తండ్రి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు-వీర్లంకమ్మ భార్యాభర్తలు. వీరి కొడుకు వీరరాఘవయ్యకు వివాహం కాగా భార్యతో గొడవపడి దూరంగా వుంటున్నాడు. దీంతో అతడు భార్యపైనే కాకుండా తల్లిదండ్రులకు కోపాన్ని పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి వచ్చిన అతడు తల్లిదండ్రులను అతి కిరాతకంగా హతమార్చాడు. ఇంట్లో పడుకున్న తల్లిదండ్రులప గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి వీర్లంకమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా కొనఊపిరితో వున్న నాగేశ్వరరావును అవనిగడ్డ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

వీడియో

తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన అనంతరం వీరరాఘవయ్య హాయిగా నిద్రపోయాడు. ఇంటి చుట్టుపక్కల వారు వచ్చి నాగేశ్వరరావు హాస్పిటల్ కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. నిద్రిస్తున్న కొడుకు వీరరాఘవయ్యను లేపి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.