అమ్మను వేధిస్తున్న తండ్రిపై కక్ష పెంచుకున్న కొడుకు నాన్నిని హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన గోగిశెట్టి సాంబయ్య అలియాస్ శ్రీను, రాణి దంపతులు పాతగుంటూరులోని ఆంజనేయస్వామిగుడి కూడలిలో అద్దెకు ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు శివప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు కిశోర్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాంబయ్య లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో అతను గత కొద్దిరోజులుగా మరో మహిళతో సంబంధం పెట్టుకుని భార్యను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో భార్యను సాంబయ్య వేధింపులకు గురిచేస్తున్నాడు.

దీనికి తోడు మద్యానికి బానిసైన అతను భార్యను ప్రతిరోజు తీవ్రంగా కొట్టేవాడు. స్ధానికులు, బంధువులు ఇద్దరికి సర్దిచెబుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కిశోర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. సాయంత్రం వరకు స్నేహితులతో సరదాగా గడిపాడు.

రాత్రి పది గంటల సమయంలో సాంబయ్య మరోసారి భార్య రాణిని తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె భయంతో పార్క్ సెంటర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయాన్ని ఆమె తన చిన్నకొడుకు కిశోర్‌కు ఫోన్‌లో తెలిపి కన్నీరుపెట్టుకుంది.

దీంతో కోపంతో ఊగిపోయిన అతను ఇంటికి వచ్చి... పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై మోదాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాంబయ్య... ఇంటి ఆవరణలో కుప్పకూలిపోయాడు.

అంతటితో ఆగక తన చేతిలోని రోకలిబండతో మళ్లీ తండ్రిపై దాడి చేస్తూనే ఉన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. శనివారం స్ధానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న కిశోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బంధువుల ఇంట్లో ఉన్న రాణి విషయం తెలుసుకుని భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించింది.