Asianet News TeluguAsianet News Telugu

దారుణం: మరో మహిళతో తండ్రి చనువు.. 20 లక్షలు సుపారీ ఇచ్చి మరీ

నరసరావుపేట పట్టణంలో సంచలనం సృష్టించిన రియల్టర్ కోటపాటి మల్లికార్జునరావు హత్యకేసును పోలీసులు చేధించారు. తండ్రి పరాయి మహిళతో చనువుగా వుండటంతో పాటు ఆస్తి  కోసం కొడుకే అతనిని హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. 

son brutally assassinated his father in guntur ksp
Author
guntur, First Published Jul 18, 2021, 12:10 AM IST

తండ్రి మరో మహిళతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో పాటు ఆస్తి తనకు దక్కదేమోన్న భయంతో ఓ కొడుకు కన్నతండ్రిని హత్య చేశాడు. కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకుని తండ్రిని హతమార్చాడు. నరసరావు పేట రావిపాడులోని గాయత్రీనగర్‌ వద్ద జరిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కోటపాటి మల్లికార్జునరావు హత్యకేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసు వివరాలను గుంటూరు రూరల్‌ జిల్లా అదనపు ఎస్పీ (క్రైం) ఎన్‌.విఎస్‌.మూర్తి మీడియాకు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటకు చెందిన కోటపాటి మల్లికార్జునరావు (56) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఇతని స్వస్థలం ప్రకాశం జిల్లా. ఉపాధి కోసం ఆయన రామిరెడ్డిపేటకు వచ్చాడు. ఏడాది కిందట మోసం చేశాడనే నెపంతో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ తడికమళ్ల రమేష్‌ని మల్లికార్జునరావు, అతని కొడుకు సాయికృష్ణ, డ్రైవర్‌ కలిసి హత్య చేశారు. దీనిపై నరసరావుపేట రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదవ్వగా.. ప్రస్తుతం వీరు బెయిల్‌పై ఉన్నారు.  

ఈ క్రమంలో మల్లికార్జునరావు ఓ మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఆస్తి, డబ్బుని ఆమెకు ఖర్చుచేస్తున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని సాయి కృష్ణ తండ్రిపై కక్షపెంచుకున్నాడు. యూకేలో చదువుకున్న సాయి సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు. దీనికి తండ్రి అంగీకరించకపోగా హేళన చేశాడు. ఈ నేపథ్యంలో పరాయి మహిళతో తండ్రి సంబంధం కారణంగా అతను బతికి ఉన్నంత వరకూ తనకు ఆస్తి దక్కదనే భయంతో మల్లిఖార్జునరావు హత్యకు స్నేహితుడు కోట అనిల్‌తో కలిసి కుట్రపన్నాడు.

దీనిలో భాగంగా రొంపిచర్ల మండలం మునమాకకు చెందిన ఈదర రాజారెడ్డిని సంప్రదించి, రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రాజారెడ్డి తన అనుచరులైన చినిశెట్టి దుర్గాప్రసాద్, మున్నంగి గోపీ, వేల్పూరి నాగబ్రహ్మచారి, యక్కంటి అంజరెడ్డి, నార్నే శ్రీనులతో చెప్పి వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇచ్చేలా మాట్లాడుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా కిరాయి హంతకులంతా మల్లికార్జునరావు కదలికలపై రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో జూలై 7న గాయత్రీనగర్‌ వెంచర్‌ వద్దకు వెళ్లిన మల్లికార్జునరావును కిరాతకంగా మారణాయుధాలతో హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కొడుకు సాయికృష్ణపై నిఘా పెట్టి అతని సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించారు.  శుక్రవారం ఉదయం నరసరావుపేట ఇస్సప్పాలెం వద్ద కోటపాటి సాయికృష్ణ అతని స్నేహితునితోపాటు, మిగిలిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 38 ఏళ్ల వయసులోపు వారే కావడం గమనార్హం. వీరిన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే హత్యకు కుట్రపన్నిన ఈదర రాజారెడ్డి, సాహిద్‌ నాగూర్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios