ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాలనపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. పేదలకు ఏపీ ప్రభుత్వం పంచిపెట్టిన ఇళ్ల పంపిణీలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనపై అధ్యయనం జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతమైన అవినీతి పాలన ఏపీలో జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి 7 లక్షల ఇళ్లు కేటాయించినట్లు సోమువీర్రాజు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.1400కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

మొన్న పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల కుంభకోణంలో రూ.30వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేవలం రూ.3లక్షలు సరిపోతుందని ఆయన అన్నారు. నీరు- చెట్టూలో కూడా భారీ అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రతీ ఏరియాల్లో ఇసుక రీచుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.  జన్మభూమి కమిటీల్లో ప్రతి పథకంలోనూ లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నారాయణ కళాశాలలపై కూడా ఆయన నిప్పులు చెరిగారు.