వికేంద్రీకరణ‌కు మద్దతుగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఏం చేశారని ప్రశ్నించారు.

వికేంద్రీకరణ‌కు మద్దతుగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఏం చేశారని ప్రశ్నించారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంశధార ప్రాజెక్టుకు రూ. 200 కోట్లు తెచ్చుకోలేని మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేస్తారా? అని మండిపడ్డారు. విజయనగరంలో ఫ్యాక్టరీలు మూతబడితే బొత్స సత్యనారాయణ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అటువంటి వాళ్లు వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. 

రాజధాని పేరుతో రాజకీయాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భావోద్వేగాలు రెచ్చగొట్టి.. టీడీపీ, వైసీపీలు చలిమంటలు కాచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై చంద్రబాబుకు, జగన్‌కు ప్రేమ లేదని ఆరోపించారు. 8 ఏళ్లలో రాజధాని కోసం టీడీపీ, వైసీపీలు ఏం చేశాయో చెప్పాలని అన్నారు. 

వైసీపీ రూలింగ్ పార్టీ కాదని.. ట్రేడింగ్ పార్టీ అని కామెంట్ చేశారు. వివాదాస్పద అంశాలను రాజకీయం చేయాలనేది సీఎం జగన్ ఆలోచన అని విమర్శించారు. మోసం చేసే పార్టీలను నిలదీసే బాధ్యతను బీజేపీ తీసుకుందని చెప్పారు. వైసీపీ పాలనలో విశాఖలో భూ దందా జరిగిందని.. ఇది తప్ప అభివృద్దికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాజధానిపై మాట్లాడే అర్హత వైసీపీ, టీడీపీకి లేదని అన్నారు.