ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పొత్తులకు సంబంధించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే ఏపీలో అభివృద్ది సాధ్యం అని అన్నారు. రాష్ట్రంలో యోగి, మోదీ లాంటి నాయకులు అధికారంలోకి రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పొత్తులకు సంబంధించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు ప్రభుత్వాలను ఏపీ ప్రజలు చూశారని అన్నారు. రాష్ట్రంలో యోగి, మోదీ లాంటి నాయకులు అధికారంలోకి రావాలన్నారు. రౌడీలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీతోనే ఏపీలో అభివృద్ది సాధ్యం అని అన్నారు. మోదీ చేసిన అభివృద్ది కార్యక్రమాలను చూపించి ఓట్లు అడుగుతామని సోము వీర్రాజు చెప్పారు.
2024లో జనంతోనే బీజేపీ పొత్తు అని.. అవసరమైతే జనసేనతో పొత్తు ఉంటుందని అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. వాటిపై ఆయనే సమాధానం చెప్పారు. తమ లైన్ క్లియర్‌గా ఉందని.. తమ టెన్షన్ అంతా ఏపీ అభివృద్దేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. 108కి ఫోన్ చేస్తే సకాలంలో రావడం లేదన్నారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
ఇక, ఏపీలో రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్న ఆయన.. అవసరమైతే త్యాగాలకూ సిద్ధమని ప్రకటన చేశారు. ఈ విధంగా ఆయన పరోక్షంగా పొత్తులకు సంకేతాలు పంపారు.
అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందిస్తూ.. అనేక సందర్భాల్లో ఆ త్యాగాలను గమనించామని అన్నారు. బీజేపీ ఇప్పటికే చాలా త్యాగాలు చేసిందన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రాజకీయ పార్టీలకు, కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోము వీర్రాజు కామెంట్స్‌కు భిన్నంగా ఉన్నాయి. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలి. వ్యక్తిగతంగా లాభాపేక్ష ఆశించి పొత్తులకు వెళ్లనని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలి.. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందన్నారు. వైసీపీ నాయకులు సింహం సింగిల్‌గా వస్తుందనే డైలాగ్‌లు కొడుతున్నారని.. తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో.. ఎలా రాజకీయాలో చేయలో మీరు నేర్పుతారా అని పవన్ ప్రశ్నించారు.
ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇందులో ఎవరెవరూ కలుస్తారో ఇప్పుడే తనకు తెలియదన్నారు. దీనిపై విశాల దృష్టితో చర్చలు జరగాల్సి ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల యోగక్షేమాల కోసం బలోమైన ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నామని.. భవిష్యత్తులో రాష్ట్రంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు. అదే సమయంలో తమకు ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉందని పవన్ చెప్పారు.
