దిగొచ్చిన సోము వీర్రాజు: అజ్ఞాతం వీడి, ఆఫీసుకు ఫోన్

దిగొచ్చిన సోము వీర్రాజు: అజ్ఞాతం వీడి, ఆఫీసుకు ఫోన్

విజయవాడ: తనకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగా అలక వహించిన బిజెపి నేత సోము వీర్రాజు దిగి వచ్చారు. ఆయన అజ్ఞాతం వీడారు. కన్నా లక్ష్మినారాయణను ఎపి పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన అలక వహించి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
 
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన  ఫోన్‌ చేసి మాట్లాడారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, కార్యకర్తల సహాయంతో పార్టీని బలోపేతం చేయాలని ఫోన్ ద్వారా పిలుపునిచ్చారు.

కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి దక్కడంతో ఎవరికీ అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది. 

తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ఈ రెండు కమిటీలలోని కొందరు సభ్యులు ప్రకటించారు. తమ రాజీనామాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపినట్టు తెలిపారు.

ఇదిలావుంటే, మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టుమ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ రాం మాధవ్ అన్నారు. కులాల వారీగా తమ పార్టీ బాధ్యతలు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి, ప్రజల ఆమోదం మేరకే నిర్ణయాలుంటాయన్నారు. 

కులాలకు అతీతంగా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పారు. బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని వెల్లడించారు. కేంద్రనాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా ఏపీ రాజకీయాలకూ, పార్టీ వ్యవహారాలకు సమయం కేటాయిస్తామని చెప్పారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos