ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 నెలల పాలనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, పనులు జరగడంలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులన్నీ నిలిచిపోయాయని మండిపడ్డారు. 

రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, హంద్రినీవా, పేదలకు ఇళ్ల నిర్మాణం.. లాంటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయాలన్న విషయంలో వైసీపీ విజయం సాధించిందన్నారు. పక్షపాతం, కక్ష్య సాధింపులే ఎజెండాగా రాష్ట్రం ముందుకెళుతుందని, పరిపాలన కుంటుపడిందని విమర్శించారు.

రాష్ట్రం, ప్రజల భవిష్యత్ ఏంటనేది సీఎం జగన్ ఆలోచించడంలేదని, ఆయన సలహాదారులు ఏం చెబుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదని సోమిరెడ్డి అన్నారు. మొత్తంగా రాష్ట్రం గ్రోత్ రేటు పడిపోయిందన్నారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఉందనేది ఎవరూ మాట్లాడుకునే పరిస్థితి లేదని, దీనికి ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు, కక్ష్య సాధింపులే కారణమన్నారు. 

ఈ 17 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రానికి నష్టం జరిగిందనేది జగమెరిగిన సత్యమని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.