Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు సంచనల నిర్ణయం: ఆరుగురు సిట్టింగ్ లపై వేలాడుతున్న కత్తి

2019 ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతూనే 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాజకీయంగా తూర్పుగోదావరి జిల్లాను సెంటిమెంట్ గా భావించే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమరానికి కూడా అక్కడ నుంచే శంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు. 

Some Tdp MLAs may not get tickets to contest 2019 elections
Author
Amaravathi, First Published Sep 5, 2018, 7:12 PM IST

అమరావతి: 2019 ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతూనే 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాజకీయంగా తూర్పుగోదావరి జిల్లాను సెంటిమెంట్ గా భావించే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమరానికి కూడా అక్కడ నుంచే శంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు ఏ పార్టీ చేజిక్కుంచుకంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం ఉంది. రాజకీయ చైతన్యవంతమైన జిల్లా కావడం, అత్యధిక నియోజకవర్గాలు ఉన్న జిల్లా కావడంతో ఇక్కడ నుంచే పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆరుగురు ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ఆరు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో సమర్థవంతమైన వ్యక్తులను ఎన్నికల బరిలో నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.  

2019 ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వని సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసింది. ఇప్పటికే వారిని పక్కన పెట్టినట్లు పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పిస్తే ఎదురుయ్యే పరిణామాలు, వాళ్ల ప్రభావం పార్టీ అభ్యర్థిపై చూపుతుందా, టిక్కెట్లు ఇవ్వకపోతే రెబెల్ గా బరిలోకి దిగుతారా అన్న అంశాలపై పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే పార్టీ తమను పక్కన పెట్టిందని గ్రహించిన కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.  
 
కాకినాడ లోక్‌సభ పరిధిలోకి వస్తే ప్రత్తిపాడు నియోజకవర్గం అభ్యర్థి మార్పు తధ్యం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుపుల సుబ్బారావుకు వయోభారం దృష్ట్యా అతనిని తప్పించాలని పార్టీ భావిస్తోంది. అతని స్థానంలో వరుపుల రాజాకి టిక్కెట్ ఇచ్చే యోచనలో ఉంది.   సుబ్బారావు  సోదరుడు మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనవడు వరుపుల రాజా. రాజా కుటుంబ సభ్యుడు కావడంతో టిక్కెట్ ఇచ్చినా వ్యతిరేకత రాదు అనే ఆలోచనలో పార్టీ ఆలోచన. అలాగే కుటుంబంలో ఒకరికి ఇస్తే సుబ్బారావు నుంచి కూడా వ్యతిరేకత రాదని పార్టీ భావిస్తోంది.  

ఇకపోతే కాకినాడ రూరల్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అనంత లక్ష్మీపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ సర్వేలో తేలినట్లు సమాచారం. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో అనంత లక్ష్మి ముద్ర లేకపోవడం, ఎమ్మెల్యే తనయులపై అవినీతి ఆరోపణలు గెలుపుకు అవరోధంగా మారే అవకాశం ఉందని పార్టీ భావిస్తుంది. దీంతో ఆమెను తప్పించడం ఖాయమని తెలుస్తోంది. 

మరోవైపు కాకినాడ ఎంపీగా ఉన్న తోట నరసింహాన్నిఎంపీ స్థానం నుంచి తప్పించాలని భావిస్తోంది. తోట నరసింహం ఎంపీగా అయిష్టతతో ఉండటంతో పాటు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేసి కేబినేట్లో మంత్రిగా ఉండాలన్నదే తన కోరిక అని పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో ఎంపీగా ఉన్న తోట నరసింహాన్ని తప్పిస్తే ఏ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాలన్నఅంశంపై టీడీపీ జిల్లా నాయకత్వం తలలు పట్టుకుంటుంది.  

2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి నరసింహం గెలుపొంది కేబినేట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ సారి జగ్గంపేట టిక్కెట్ జ్యోతుల నెహ్రూకే ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో నరసింహం కోసం ఏ ఎమ్మెల్యేను తప్పించాలి అన్న ఆలోచన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పెద్దాపురం నుంచి పోటీ చెయ్యాలని భావించిన పెద్దాపురం నుంచి హోంమంత్రి చినరాజప్పబరిలో ఉన్నారు. దీంతో ఆ స్థానం కూడా ఇచ్చే అవకాశం లేదు.  
 
ఇక అమలాపురం లోక్ సభ పరిధిలోకి వస్తే నలుగురు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నా మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాట్ల బుచ్చిరాజుకే టిక్కెట్ ఇచ్చే యోచనలో పార్టీ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తేవడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో దాట్ల బుచ్చిరాజుకే టిక్కెట్ కేటాయించి గెలిపించుకోవాలని భావిస్తోంది.   
 
అటు అమలాపురం నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించింది టీడీపీ అధిష్టానం. కోనసీమకు జిల్లా కేంద్రంగా ఉన్న ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం అయితాబత్తులు ఆనందరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం చినరాజప్పతో వైరం కాస్త ఇబ్బందిగా మారింది. ఆనందరావు పనితీరుపై కాస్త అసంతృప్తితో ఉన్నా సమర్థవంతమైన నాయకుడు లేకపోవడంతో అతను సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లేనని చెప్తున్నారు. ఒకవేళ సమర్థవంతమైన నాయకుడు తెరపైకి వస్తే ఆనందరావుకు టిక్కెట్ కష్టమంటూ సంకేతాలు వెలువడుతున్నాయి.  

అటు అమలాపురం లోక్ సభ నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడుని బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. బాలయోగి తనయుడిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబును ఎలా బుజ్జగించాలా అన్న ఆలోచనలో ఉంది టీడీపీ. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలయోగి తనయుడు ఎంపీగా బరిలోకి దిగితే పార్టీకి మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. 

రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు స్థానం చలనం తప్పేలా లేదు. రాజోలు కాకుండా మరో రిజర్వుడు స్థానం నుంచి పోటీ చెయ్యించాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికల సమయానికి సమర్థవంతమైన నాయకుడు టీడీపీలోకి వస్తే సూర్యారావుకు మెుండి చేయి చూపించే అవకాశం లేకపోలేదు. గొల్లపల్లికి వేరే నియోజకవర్గం కేటాయించడమా లేక పార్టీలో క్రియాశీలక పదవి కట్టబెట్టడమా అని సందిగ్ధంలో ఉంది టీడీపీ. 

ఇకపోతే పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తికి సైతం ఉద్వాసన పలికే అవకాశం లేకపోలేదు అంటున్నాయి పార్టీ వర్గాలు. వయో భారం దృష్ట్యా పులపర్తి నారాయణ మూర్తిని తప్పించాలని భావిస్తోంది. అలాగే పులపర్తికి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై పట్టుకోల్పోకుండా ఉండేందుకు సమర్థవంతమైన నేతకోసం అన్వేషణ ప్రారంభించిందట టీడీపీ. 
 
ఇకపోతే రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి స్థాన చలనం తప్పదంటూ ప్రచారం జరుగుతుంది. 1983 నుంచీ రాజమహేంద్రవరం సిటీలో మంచి పట్టున్న బుచ్చయ్య చౌదరిని గత ఎన్నికల్లో రూరల్ టిక్కెట్ కేటాయించారు. అక్కడ కూడా బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. అయితే ఈసారి గోరంట్లను రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దించితే గెలుపుతోపాటు భారీ మెజారిటీ దక్కే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. అలాగే రాజమహేంద్రవరం రూరల్ టిక్కెట్ కొత్తవారికి కేటాయిస్తే పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios