అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా  జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందిన ఘటనపై సోమయాజులు  కమిషన్  నివేదికను  బుధవారం నాడు  ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తొక్కిసలాటకు  సీఎం  కారణం కాదని కమిషన్ ఈ నివేదిక అభిప్రాయపడింది.

2015 జూలై 15 వ తేదీన గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని రాజమండ్రిలోని పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో సుమారు 30 మందికి పైగా  మృతి చెందారు.

ఈ ఘటనపై  ఆనాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు  చంద్రబాబునాయుడే కారణంగా  విమర్శలు గుప్పించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం  సోమయాజులు కమిషన్ ను ఏర్పాటు చేసింది. సోమయాజులు కమిషన్ ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేసింది.

ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలపై ప్రత్యక్షసాక్షులు అధికారులను విచారించింది. మరో వైపు టెక్నాలజీ సహాయాన్ని కూడ తీసుకొని  ఈ ఘటనపై నివేదికను అందించింది.ఒకే ముహుర్తానికి స్నానం చేయాలనే  పిచ్చి నమ్మకం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్  అభిప్రాయపడింది. పుష్కరఘాట్ వెడల్పు కూడ 300 మీటర్లు మాత్రమే ఉన్న విషయాన్ని  ఆయన తన నివేదికలో ప్రస్తావించారు.

మరోవైపు చంద్రబాబునాయుడు పుష్కరఘాట్ నుండి వెళ్లిపోయిన తర్వాతే  ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్  నివేదికలో స్పష్టం చేసింది.