ఓ పేద పురోహితుడు... కేవలం పౌరహిత్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులను రూపాయి రూపాయి పోగు చేసి దాచుకున్నాడు.  ఆ దాచుకున్న సొమ్ము తినకుండానే ఆయన తనువు చాలించాడు. ఆ చనిపోయాక రూ.లక్షల్లో ఆయన సంపాదన బయటపడింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలో ఉండే అప్పల సుబ్రహ్మణ్యం(70) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయన బంధువులు, పిల్లలు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో స్థానికులు కొందరు బంధువులకు సమాచారం ఇచ్చి, బుధవారం మృతదేహాన్ని ఖననం చేశారు. 

అనంతరం సుబ్రహ్మణ్యం చాలాకాలంగా నివాసం ఉన్న పాడుపడ్డ భవనాన్ని పరిశీలించారు. అక్కడ అనేక మూటలు కనిపించడంతో విప్పిచూశారు. వాటిల్లో భారీగా నగదు ఉండటంతో ముక్కున వేలేసుకున్నారు. మూటలు విప్పి లెక్కించడం ప్రారంభించారు. ఎంతకూ తరగకపోవటంతో కౌంటింగ్‌ మిషన్‌ ను తెచ్చి లెక్కించటం మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు రూ.6లక్షలు తేలింది. మరిన్ని మూటల్లోని నగదు లెక్కించాల్సి ఉంది. ఆయన అంత కష్టపడి సంపాదించినా.. కనీసం తినడానికి కూడా ఖర్చుపెట్టుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఆ డబ్బును అతని బంధువులకు అప్పగించే అవకాశం ఉంది.