విజయవాడ: ఏపీ రాష్ట్రంలోని ఆలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. రామతీర్థం ఘటన  మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆలయానికి తాళం వేసి ఉంది. అయినా దుండగులు ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుమారం రేపుతోంది.

విజయవాడ పట్టణంలోని పండిట్ నెహ్రు బస్టాండ్ సమీపంలోని సీతారామ ఆలయంలో సీతారామ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు ఆదివారం నాడు ఉదయం ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆలయానికి తాళం వేసి ఉంది. అయితే ఆలయ తలుపుకు ఉన్న గ్రిల్  మధ్య నుండి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ విషయం తెలుసుకొని టీడీపీ, బీజేపీ నేతలు ఆలయం వద్ద ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. ఈ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని  వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరగడం కలకలం చేలరేగింది.