జగన్ సర్కార్ అర్థరాత్రి పూట సింహాచలం, మన్సస్ ట్రస్టుల చైర్మన్ గా అశోక్ గజపతి రాజును తొలగించి సంచయితను అపాయింట్ చేశారో... అది మొదలు కుటుంబ మనస్పర్థలకు రాజకీయ రంగును సైతం పులిమారు. 

ఇక తాజాగా జగన్ సర్కార్ మన్సస్ ట్రస్టు బోర్డు చైర్మన్ గా, సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ గా  సంచయితను నియమించినప్పటికీ... ట్రస్టు బోర్డులు మాత్రం ఇంకా చైర్మన్ గా అశోక్ గజపతి రాజు పేరును మార్చలేదు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్రస్టులు సీరియస్ గా తీసుకోలేదా అనే వార్త కూడా వినబడుతుంది. 

కేవలం ఆ ఒక్క ట్రస్ట్ మాత్రమే కాకుండా ఇంకా సింహాచలం దేవస్థానం వెబ్ సైట్ లో కూడా దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఇంకా అశోక్ గజపతి రాజు పేరే ఉండడం ఇక్కడ మరో ఆసక్తికర అంశం. 

ఇలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొని రెండు రోజులు గడుస్తున్నప్పటికీ.... ట్రస్టు బోర్డు ఎందుకు ఆ పేజీని మార్చలేదని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. చైర్మన్ ని మార్చారు తప్ప మిగిలిన సభ్యులంతా కూడా అశోక్ గజపతి రాజుకి దగ్గరివారే అవడం వల్లనే ఇంకా వారి మన్సస్ ట్రస్టు పేజీలో మార్చలేదనే వాదన కూడా వినబడుతోంది. 

ట్రస్టు అంటే సొసైటీ వారు మార్చడానికి సమయం పట్టొచ్చు. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఈఓల నుంచి మొదలుకొని అనేక మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయినప్పటికీ కూడా పేరు మారకపోవడం మరింత విడ్డూరం. 

ఇక ఈ వివాదంపై స్పందించిన అశోక్ గజపతి రాజు, ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని ఈ మాజీ ఎంపీ అన్నారు. మాన్సాస్ ట్రస్టు వివాదం పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అశోక్ గజపతి రాజు స్పందించారు.

మాన్సాస్ ట్రస్ట్  ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ... వేరే మతం వారిని ఎలా నియమిస్తారని అన్నారు. 

ప్రభుత్వ వైఖరి వింతగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జీవోనీ కనీసం బయట పెట్టలేదని ఆయన అన్నారు.వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రస్టు,దేవాలయ భూములపై కన్నేశారని మండిపడ్డారు. దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు.

ఇక సంచయిత అన్యమతస్థురాలు అని అశోక్ గజపతిరాజు అనడంపై తీవ్ర భావోద్వేగానికి లోనయింది సంచయిత. తాను క్రిస్టియన్ నని బాబాయ్ మాట్లాడితే బాధేస్తుందనే ఆమె అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అన్నారు. తాను హిందువునే అని ఆమె స్పష్టం చేశారు. వాటికన్ సిటీకి వెళ్లి ఫొటోలు దిగితే క్రిస్టియన్ ను అవుతానా అని ఆమె అడిగారు. అశోక్ గజపతి రాజు మసీదుకు గానీ చర్చికి గానీ ఎప్పుడూ వెళ్లలేదా అని నిలదీశారు. 

Also Read: అశోక్ గజపతి రాజుకు షాక్ పెద్ద కుట్ర: సంచయితకు షో కాజ్ నోటీస్

ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ కావడానికి తనకు అన్ని అర్హతలున్నాయని ఆమె అన్నారు. తమ తాతగారు పీవీజీ రాజు వారసత్వాన్ని కొనసాగించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. అతిథికి ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారని, ఆ రోజు తాను గుర్తుకు రాలేదా అన్నారు. అతిథికి ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించి తనను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. 

రాజకీయ సాధికారిత కోసం పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, టీడీపీ నాయకులు ఓ మహిళ ఎదుగుదలను ప్రశ్నిస్తున్నారని, రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ఇది పూర్తి ట్రస్ట్ విషయమని ఆమె అన్నారు. చీకటి జీవోల ద్వారా తాను చైర్ పర్సన్ అయినట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అంటూ పట్టపగలు, అందరి సమక్షంలో ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ అయ్యానని అన్నారు. ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్తే రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆమె అన్నారు