Asianet News TeluguAsianet News Telugu

జయరాం మర్డర్ మిస్టరీ: ఎవరీ శిఖా చౌదరి..?

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2015లో న్యూస్ ఛానల్ నిర్వహణపై సలహాలు ఇచ్చే పేరుతో జయరాం ఆఫీసులో కాలుపెట్టింది శిఖా చౌదరి. ఆ తర్వాత ఆమెను ఛానెల్ వైస్ చైర్మన్ గా నియమించారు. వైస్ చైర్మన్ గా ఎక్స్ ప్రెస్ టీవీలో అడుగుపెట్టిన శిఖా చౌదరి కాలక్రమేణా అన్ని సంస్థల్లో డైరెక్టర్ గా చోటు సంపాదించారు. 

Sikha Coudhary became key person in Jayaram's business activities
Author
Vijayawada, First Published Feb 2, 2019, 5:48 PM IST

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు వరుస ట్విస్ట్ లు ఇస్తోంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు శిఖాచౌదరి. అసలు శిఖాచౌదరి ఎవరు...? మేనకోడలే సొంత మేనమామ హత్యకు ప్లాన్ వేసిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..? 

జయరాం మర్డర్ కేసులో ఆమె పాత్ర ఉందంటున్న వార్తల్లో వాస్తవముందా...? ఎవరి కుట్రలోనో ఆమె ఇరుక్కుందా.....? అసలు పోలీసులు శిఖాచౌదరినే ఎందుకు టార్గెట్ చెయ్యాల్సి వచ్చింది. 

జయరాం జీవితంలో శిఖాచౌదరి పాత్ర ఏంటి ఎవరు ఈ శిఖా చౌదరి అనే అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. శిఖా చౌదరి జయరాం మేన కోడలు. చిన్న చెల్లెలు సుశీల పెద్ద కుమార్తె. శిఖా చౌదరి అసలు పేరు పులివర్తి మాధురి. 

విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మాధురి అలియాస్ శిఖా చౌదరి ఇంజనీరింగ్ పూర్తి చెయ్యడానికి ప్రధాన కారణం జయరాం. జయరాం చిన్న చెల్లెలు అయిన సుశీల భర్తతో విభేదాల కారణంగా చాలా కాలం నుంచి కానూరులోని తల్లిదండ్రులు వద్దే ఉండేది. 

దీంతో సుశీల పిల్లలు ఇద్దర్నీ జయరాం చూసుకునే వారు. వారిలో పెద్ద అమ్మాయి అయిన శిఖా చౌదరిని ఇంజనీరింగ్ చదవించగా చిన్న అమ్మాయి మనీషాను మెడిసిన్ చదవించారు.  అంతేకాదు ఏడాదిన్నర క్రితం మాధురి చెల్లెలు మనీషా వివాహం అంగరంగ వైభవంగా చేశారు జయరాం. అయితే మాధురి మాత్రం పెళ్లి చేసుకోలేదు.

ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లు ఆమె హైద్రాబాద్ లోని సినీ ఇండస్ట్రీతో సంబంధాలు పెట్టుకుంది. ఆ తర్వాత మాదాపూర్ లో ఉన్న ఓ న్యూస్ ఛానల్ లో కొన్నాళ్ళు పని చేసింది. అయితే జయరాం భార్య పద్మశ్రీకి చెల్లెలి కుటుంబానికి డబ్బు అంతాపెడుతున్నారని ఆవేదన ఉండేదని అంటుంటారు. ఈ నేపథ్యంలో వారిని కొన్నాళ్లపాటు కంపెనీ వ్యవహారాల్లో వేలుపెట్టనియ్యలేదు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2015లో న్యూస్ ఛానల్ నిర్వహణపై సలహాలు ఇచ్చే పేరుతో జయరాం ఆఫీసులో కాలుపెట్టింది శిఖా చౌదరి. ఆ తర్వాత ఆమెను ఛానెల్ వైస్ చైర్మన్ గా నియమించారు. వైస్ చైర్మన్ గా ఎక్స్ ప్రెస్ టీవీలో అడుగుపెట్టిన శిఖా చౌదరి కాలక్రమేణా అన్ని సంస్థల్లో డైరెక్టర్ గా చోటు సంపాదించారు. 

ఆమె వల్లే ఛానెల్ మూతపడిందని ఛానెల్ బాధితులు విమర్శించిన దాఖలాలు లేకపోలేదు. జయరాం కుటుంబంలో కలతలకు కారణం కూడా శిఖా చౌదరీయే అంటుంటారు. అంతేకాదు ఇటీవలే విజయవాడలోని కోట్లాది రూపాయల విలువైన భూమిని శిఖాచౌదరికి జయరాం రాసిచ్చారని కూడా తెలుస్తోంది. 

ఎక్స్ ప్రెస్ టీవీ నష్టాల్లో ఉన్నా జయరాం మాత్రం శిఖా చౌదరికి బీఎం డబ్ల్యూ కారు కొనివ్వడం చర్చనీయాంశంగా మారింది. జయరాం వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు రావడానికి కారణమైన శిఖా చౌదరిని ఎందుకు చేరదీశారు. భార్య నిత్యం ఆమెను దూరం పెట్టాలని చెప్తున్నా ఎందుకు దగ్గరకు చేరదీశారు. 

ఆమెను అన్ని కంపెనీల్లో డైరెక్టర్ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది. పెద్ద సోదరి పిల్లలను కేవలం కంపెనీల్లో ఉద్యోగులుగా చూసిన జయరాం శిఖా చౌదరి, మనీషాలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జయరాం హత్యకేసులో ఆమె పాత్ర ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎక్కడ బెడిసికొట్టింది అన్న అంశాలపై జోరుగా చర్చ జరుగుతుంది.    

Follow Us:
Download App:
  • android
  • ios