తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా చీరాల ఘటనకు సంబంధించి పోలీసులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చీరాల టూటౌన్ ఎస్ఐ విజయ్ కుమార్‌పై వేటు పడింది.

ఆయనను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. ఇక యువకుడి మృతిపై విచారణాధికారిగా గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్‌ను నియమించింది.

కాగా చీరాలలో కిరణ్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం తన మిత్రులతో కలిసి బైక్‌పై బయటకు వచ్చాడు. ఈ సమయంలో వీధుల్లో ఉన్న విజయ్ కుమార్ వారిని ఆపి.. మాస్క్ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:ఎస్సై చేతిలో చీరాలలో యువకుడి మృతి, జగన్ సీరియస్, విచారణ

లాఠీతో తీవ్రంగా కొట్టారు. లాఠీ దెబ్బలతో కిరణ్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతనిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కిరణ్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. కిరణ్ బుధవారం కన్నుమూశాడు. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మృతుడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.

ప్రకాశం జిల్లా చీరాల ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించారు