ప్రకాశం జిల్లా చీరాల ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించారు.

మరోవైపు చీరాల ఘటనలో పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఘటన జరిగిన సమయంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారని.. తనిఖీల్లో భాగంగా ప్రశ్నించిన పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని ఎస్పీ చెప్పారు.

Also Read:మాస్క్ ధరించలేదని చితకబాదిన ఎస్సై... యువకుడు మృతి

సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్సై విజయ్ కుమార్ వారిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా.. కిరణ్ అనే వ్యక్తి పోలీస్ వాహనం నుంచి కిందకు దూకాడని సిద్ధార్థ్ పేర్కొన్నారు.

వాహనంలో నుంచి ఒక్కసారిగా దూకడం వల్ల కిరణ్ తలకు గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. అనంతరం అతనిని చికిత్స కోసం గుంటూరు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని కౌశల్ వెల్లడించారు.

కిరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎస్సై విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు. మొత్తం ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. యువకుడి మృతి ఘటనపై తాను స్వయంగా సీఎం జగన్‌తో మాట్లాడానని సిద్ధార్ధ్ కౌశల్ తెలిపారు