తిరుపతి: ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళను ఎస్ఐ బెల్ట్ తో కొట్టడం కలకలం రేపింది. ఈ విషయమై బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగింది.ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

జిల్లాలోని తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి ఆటో నడుపుతోంది.ఇంటి వద్ద గార్డెన్ లోకి శనివారం నాడు తుమ్మలగుంట ఎస్సీ కాలనీకి చెందిన కొందరి గేదేలు ఆమె గార్డెన్ ను ధ్వంసం చేశాయి. గేదేలను బయటకు వెళ్లకుండా ఆమె గేటు వేసింది.

ఈ విషయం తెలిసిన యజమానులు వచ్చి ఆమెతో గొడవకు దిగి  దాడి చేసి గేదేలను తీసుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గేదేల యజమానులు పారిపోయారు.

ఈ విషయమై ఆమె ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.  అయితే అదే సమయంలో స్టేషన్ లో పూజ చేసేందుకు గదులను శుభ్రం చేశారు. ఈ విషయమై బాధితురాలిని ఎస్ఐ దూర్బాషలాడారని బాధితురాలు ఆరోపించారు. ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించిన తనను ఎస్ఐ బెల్ట్ తో కొట్టారని ఆమె చెప్పారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది.విషయం తెలుసుకొన్న సీఐ బాధితురాలితో చర్చించారు. గేదేల యజమానులపై  కేసు నమోదు చేశామన్నారు. అంతేకాదు ఎస్ఐ పై విచారణ చేసి చర్యలు తీసుకొంటామని సీఐ హామీ ఇచ్చారు.