టీడీపీ అధినేత చంద్రబాబుకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు బహిష్కరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపును సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలువురు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. తాజాగా.. ఆయన సొంత నియోజకవర్గం లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండటం గమనార్హం.

చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీ, 95 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఐదు జెడ్పీటీసీ, 90 ఎంపీటీసీ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చంద్రగిరి మండలంలో జెడ్పీటీసీ, చంద్రబాబు సొంత ఊరు ఉన్న నారావారిపల్లితో పాటు మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఈ నెల 8న ఎన్నికలు జరుగుతున్నాయి.


ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ఆదేశించడంపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుని, నెలల తరబడి ప్రచారం చేయగా.. పోలింగ్‌ సమీపిస్తున్న వేళ ఎన్నికల్ని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఆదేశాలను పట్టించుకునేది లేదని తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లిలో స్వయంగా బంధువులే ఆయన ఆదేశాలను గాలికి వదిలేసి ఎంపీటీసీ అభ్యర్థి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.