జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ తగిలనుందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో  సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ... జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఆయన భావించారు. కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, లక్ష్మి నారాయణ కూడా గెలవలేదు. వచ్చే ఎన్నికల సమయానికి కూడా పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో జేడీ  పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

జేడీ లక్ష్మి నారాయణ, ఆయన స్నేహితుడు గంపల గిరిధర్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే..గత కొంతకాలంగా ఇద్దరూ... పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ జేడీ లక్ష్మి నారాయణ జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీచేయగా... అతని స్నేహితుడు గంపల గిరిధర్.. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గా పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. ఇదిలా ఉండగా... మరో వైపు బీజేపీ కూడా రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మి నారాయణతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆయన కూడా బీజేపీలో చేరేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో బీజేపీలో అధికారికంగా చేరే అవకాశం ఉంది.