ఈ మధ్యకాలంలో విధులు పక్కన పెట్టేసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ... ఉద్యోగాలు ఎసరు పెట్టుకుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు చూసి కూడా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ ని వదలడం లేదు.  ఇప్పటికే చాలా మంది టిక్ టాక్ చేసి బుక్ అవ్వగా... తాజాగా ఈ టిక్ టాక్ పిచ్చి ఏపీలోని శక్తి టీం మహిళా పోలీసులకు కూడా పట్టింది.

టిక్ టాక్ మోజులో పడి శక్తి టీమ్స్ విధులను గాలికొదిలేస్తున్నాయన్న ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. శక్తి టీం మహిళా పోలీసులు విధులు పట్టించుకోకుండా.. టిక్ టాక్ వీడియోలు చేయగా... ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పోలీస్ వాహనంలోనే టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. దీంతో.. వీరి టిక్ టాక్ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. విధులు వదిలేసి టైం పాస్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి వీరిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూడాలి.