విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (ఎపీపీసీసి) అధ్యక్షుడు మాజీ మంత్రి శైలజానాథ్ నియమితులయ్యారు. రఘువీరా రెడ్డి స్థానంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏఐసిసి ఆ మేరకు నియామకం జరిపింది.మస్తాన్ వలీ, తులసరెడ్డిలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎఐసిసి నియమించింది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరా రెడ్డి నియమితులయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థితికి పార్టీ నిర్వీర్యమైంది. పలువురు కాంగ్రెసు నేతలు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెసు, బిజెపిల్లోకి వలస వెళ్లారు.

రఘువీరా రెడ్డి స్థానంలో శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. దాదాపుగా కాంగ్రెసు ఎపీలో ఉనికిని కోల్పోయింది. రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాకు చెందినవారు. శైలజాానాథ్ కూడా అనంతపురం జిల్లాకే చెందినవారు. 

రఘువీరా రెడ్డి బీసీ కాగా, శైలజనాథ్ ఎస్సీ వర్గానికి చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శైలజానాథ్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన గట్టిగా నిలబడ్డారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తులసి రెడ్డి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. 

ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో తులసిరెడ్డి తిరిగి కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. గతంలో టీడీపీ, బిజెపిల్లో కూడా కీలక పదవులు చేపట్టారు.