అమరావతి: రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  చెప్పారు. 

సోమవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.  అసెంబ్లీ  ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోలుకొనేది కాదన్నారు.  రాష్ట్రంలో టీడీపీకి ఇక గెలిచే అవకాశాలు లేవన్నారు. ఈ ఫలితాలు రాష్ట్రంంలో ఒక కొత్త రాజకీయ మార్పుకు నాంది పలకనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

బీజేపీతోనే  తమ రాజకీయ భవిష్యత్తు ఉందని భావించిన  నేతలు  తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి వారంతా త్వరలోనే బీజేపీలో చేరనున్నారనన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ రాష్ట్రంలోనూ కూడ ఇదే రకమైన పరిస్థితి మున్ముందు రానుందన్నారు. 

ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక దృష్టితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది జూలై 6వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.  బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.