సారాంశం

రాజధాని అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పనులు చేస్తున్న సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

అమరావతి: రాజధాని అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పనులు చేస్తున్న సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన షెడ్ కూలింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో షెడ్‌లో 20 మంది వరకు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాలకు సంబంధించి పనులు చేస్తున్న సమయంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. 

దీంతో ఆ ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. మరోవైపు భారీవర్షం కురుస్తుండటంతో అంతా అక్కడ ఏర్పాటు చేసిన షెడ్ కిందకు వెళ్లారు. అయితే గాలి వానకు షెడ్ కూలిపోయింది. రేకులు మీద పడటంతో పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. దీంతో వారిని మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే ఎవరికి ప్రాణప్రాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎయిమ్స్‌కు వచ్చి గాయపడివారిని పరామర్శించారు.