Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాగ్యుద్దం

ప్రత్యేక హోదా  విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య  మాటల యుద్దం జరిగింది.  టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదని  అధికార వైసీపీ ఆరోపించింది. ప్రత్యేక హోదాకు సమానమైన  ప్యాకేజీని ఎందుకు ఒ:ప్పుకోవాల్సి వచ్చిందో టీడీపీ సభ్యులు వివరణ ఇచ్చారు

serious discussion on special status issue in ap assembly
Author
Amaravathi, First Published Jun 18, 2019, 4:01 PM IST

అమరావతి: ప్రత్యేక హోదా  విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య  మాటల యుద్దం జరిగింది.  టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదని  అధికార వైసీపీ ఆరోపించింది. ప్రత్యేక హోదాకు సమానమైన  ప్యాకేజీని ఎందుకు ఒ:ప్పుకోవాల్సి వచ్చిందో టీడీపీ సభ్యులు వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించేందుకు  అవసరమైన మెజారిటీని ప్రజలు మీకు కట్టబెట్టారు... హోదా సాధించండి... మీకు మేం అండగా ఉంటామని టీడీపీ సభ్యులు ప్రకటించారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ వద్దు... ప్రత్యేక హోదానే కావాలని కోరుతూ అసెంబ్లీలో సీఎం జగన్ మంగళవారం నాడు తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ తీర్మానాన్ని జగన్  అసెంబ్లీలో చదివారు. ఈ తీర్మానాన్ని జగన్ చదివిన వెంటనే టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు మాట్లాడారు. 

ఈ తీర్మానాన్ని తాను వివాదం చేయదల్చుకోలేదన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుదామని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయమై ప్రజలు  తమ తీర్పును ఇచ్చారని ఆయన  అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా సాధిస్తారనే ఉద్దేశ్యంతోనే 50 శాతం ఓటర్లు మీకు ఓటు చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు. తమకు కూడ 40 శాతం మంది ఓట్లు వేశారని ఆయన గుర్తు చేశారు. భారీ మెజారిటీ సాధించిన మీరు ప్రత్యేకహోదా సాధించాలని ఆయన సూచించారు.

ఈ సమయంలో  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని ఎందుకు తీసుకొన్నారని ఆయన ప్రశ్నించారు.  ప్రత్యేక ప్యాకేజీని పొగుడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారని ఆయన గుర్తు చేశారు.

ఇదే విషయమై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా  సంజీవనా...అని చంద్రబాబునాయుడు ఇదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారన్నారు. ఇవాళ అసెంబ్లీలో టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తోందన్నారు.

మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. కానీ, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడని  వ్యక్తి చంద్రబాబునాయుడు అంటూ విమర్శలు గుప్పించారు. 
మాట చెబితే జగన్ కట్టుబడి ఉంటారు. కానీ, చంద్రబాబు మాట మీద నిలడరని  ఆయన ఎద్దేవా చేశారు. వెన్నుపోట్లు, దగా, మోసం చేయడంలో మాట తప్పడంలో చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వాలన్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఏం చేయడానికైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాను సాధిస్తామని  వైసీపీ హామీ ఇచ్చింది, మీకు ఎక్కువ ఎంపీలను కట్టబెట్టారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ కూడ హమీ ఇచ్చారు. 

కానీ, ఆ హామీని నిలుపుకోలేదన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటిస్తేనే తాము ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా బుచ్చయ్య చౌదరి చెప్పారు. ప్రత్యేక హోదాను సాధించలేదు.. అందుకే ప్రతిపక్షంలో కూర్చొన్నాం.... మీరు అధికారంలో ఉన్నారు. మీరైనా ప్రత్యేక హోదాను సాధించాలని ఆయన సూచించారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకు కూడ ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదని  మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి  మండిపడ్డారు.2014 మార్చి 2వ తేదీన ప్రత్యేక హోదా కోసం కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. 2014 జూన్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కానీ, 2015 సెప్టెంబర్ 1వ తేదీ వరకు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానమే చేయలేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు.  మరో వైపు 2016 డిసెంబర్  వరకు కూడ పోలవరం ప్రాజెక్టు గురించి కూడ ప్రస్తావించలేనే లేదన్నారు. 

ఇక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో అప్పటి టీడీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకొని తప్పు చేశామని ప్రజలకు క్షమాపణ చెప్పాలని  ఆయన టీడీపీ నేతలకు సూచించారు. తమకు సంబంధం లేని విషయాలను తీసుకొని  అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి తమకు పూసుకొంటూ చంద్రబాబు ద్వంద్వ విధానాలను బయటపడేలా చేస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios