తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) 27వ ఈఓగా డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇవాళ ఉదయం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకి చేరుకున్నారు.

అనంతరం 12 గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి పదవీబాధ్యతలు తీసుకున్నారు. జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టిన తర్వాత మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఇప్పటి వరకు ఈవోగా వ్యవహరించిన అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమించింది.

సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగిసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.