తండ్రి ప్రమాణస్వీకారం వేళ అకీరా, ఆద్యలకు అవమానం... పవన్ కల్యాణ్ అక్కడ వుండుంటేనా..!!
ఓవైపు తండ్రి పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేయడానికి సిద్దంగా వున్నారు... ఈ అపురూప దృశ్యాన్ని కళ్ళారా చూద్దామని వెళ్లిన అకీరా నందన్, ఆద్య లకు చేధు అనుభవం ఎదురయ్యింది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి పాలనకు శుభం కార్డు పడిపోయింది... చంద్రబాబు ప్రభుత్వం కొలుతీరింది. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు మాజీమంత్రులు, వైసిపి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను తీవ్రంగా అవమానించేవారు... మాటలతోనే కాదు అధికారులను అడ్డం పెట్టుకుని వారితో అమర్యాదగా వ్యవహరించేవారు. కేవలం చంద్రబాబు, పవన్ లనే కాదు వారి కుటుంబసభ్యులను కూడా అవమానించిన సందర్భాలు అనేకం.
అయితే ప్రభుత్వం మారింది... టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం కూడా చేసారు. ఇలా రాష్ట్ర ప్రజలే భారీ విజయాన్ని అందించి అధికారాన్ని కట్టబెట్టినా... కొందరు అధికారులు దాన్ని గుర్తిస్తున్నట్లుగా లేదు. ఇంకా వైసిపి అధికారంలో వుందని భావిస్తున్నారో లేక పొరపాటుగా జరుగుతుందో తెలీదుగానీ చంద్రబాబు, పవన్ కుటుంబాలకు తగిన గౌరవం లభించడంలేదని... కొందరు అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని తాజా ఘటనలు తెలియజేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన ఆయనను టిటిడి అధికారుల నుండి చేధు అనుభవం ఎదురయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం లభించలేదు. దీంతో టిటిడి ఇంచార్జ్ ఈవో, ఇతర అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేయగా టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవమానమే పవన్ కల్యాణ్ ముద్దుల బిడ్డలు అకీరా నందన్, ఆద్యకు ఎదురయ్యింది. తండ్రి ప్రమాణస్వీకార వేళ వీరికి ఎదురైన చేదు అనుభవం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది..:
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి బంపర్ మెజారిటీతో గెలిచింది. కూటమి 175 స్థానాలకు గాను ఏకంగా 164 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గాను 21 సీట్లు గెలుచుకుంది. కూటమికి వచ్చిన సీట్లలో సింహభాగం టిడిపివే అయినా ఆ క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్ కే దక్కుతోంది. పవన్ కల్యాణ్ ను కింగ్ మేకర్ గా రాష్ట్ర ప్రజానీకమే అంగీకరిస్తోంది. 100 శాతం సక్సెస్ రేటుతో పోటీచేసిన అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది... అంతేకాదు టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల గెలుపులోనూ పవన్ పాత్ర విస్మరించలేనిది.
ఇలా కూటమి ఏర్పాటునుండి తాజా విజయం వరకు పవన్ చాలా కీలకం... దీంతో చంద్రబాబు తర్వాతి స్థానం ఆయనకు దక్కింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా పవన్ ప్రమాణస్వీకారం చేసారు... ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖ దక్కనున్నట్లు సమాచారం. ఇలా పవన్ కల్యాణ్ కు అత్యున్నత పదవులు, గౌరవం దక్కుతున్న వేళ ఆయన బిడ్డలు మాత్రం అవమానం ఎదుర్కొన్నారు. తండ్రి ఓవైపు ప్రమాణస్వీకారం చేస్తుంటే మరోవైపు ఆయన ముద్దుల బిడ్డలకు చేదు అనుభవం ఎదురయ్యింది.
గన్నవరంలోని ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. తన తండ్రి పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండటంతో అకీరా నందన్, ఆద్య లు కూడా అది కళ్లారా చూసేందుకు వచ్చారు. మెగా కుటుంబసభ్యుల కోసం ఏర్సాటుచేసిన గ్యాలరీ వైపు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకుని అవమానించారు. పవన్ బిడ్డలకు ఎదురైన ఈ చేదు అనుభవం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జనసేన నేత, పెదనాన్న నాగబాబుతో కలిసి అకిరా, ఆద్య తండ్రి ప్రమాణస్వీకారానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వేదిక ముందు కుటుంబసభ్యులంతా కూర్చున్న గ్యాలరీవైపు వెళుతుండగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరో మార్గంలో వెళ్లాలని సూచించడంతో నాగబాబుకు కోపం తెప్పించింది. భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసిన నాగబాబు అకీరా, ఆద్య లను తీసుకుని అదే మార్గంలో ముందుకు వెళ్లారు.
అక్కడ పవన్ కల్యాణ్ వుంటేనా..!!
తమ బిడ్డలను పవన్ కల్యాణ్ ఎంతో ప్రేమగా చూసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల కొడుకు అకీరాను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ప్రముఖులను పరిచయం చేసారు. ఇలా ఇప్పటినుండే అకీరాను తన సినీ, రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది తమ బిడ్డలకు అవమానం జరిగిందని... అదీ తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో అని తెలిస్తే పవన్ ఊరుకుంటారా..? ఆ సమయంలో పవన్ పిల్లలతో వుండివుంటే పరిస్థితి ఎలా వుండేది..? అని మెగా ఫ్యాన్స్, జనసైనికులు చర్చించుకుంటున్నారు.
సహజంగానే పవన్ కల్యాణ్ తనను గానీ, కుటుంబసభ్యులను గానీ అవమానిస్తే అస్సలు ఊరుకోరు. తన అన్న చిరంజీవిని వైఎస్ జగన్ అవమానించారని చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటిది తన కన్న బిడ్డలను అవమానిస్తే ఊరుకుంటారా... అకీరా, ఆద్యలను భద్రతా సిబ్బంది అడ్డుకున్న సమయంలో ఆయన అక్కడే వుండివుంటే పరిస్థితి వేరేలా వుండేదని... ఆయన ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయేవారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, అతిథుల మధ్య పవన్ అత్యున్నత గౌరవాన్ని అందుకుంటుంటే... ఆయన బిడ్డలకు ఇలా చేదు అనుభవం ఎదురవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు.