న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి కీలక పాత్ర పోషించారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం విశేషం. 

కేంద్ర న్యాయశాఖలో శాసన వ్యవహారాల సెక్రటరీగా పనిచేస్తున్న డా. జి.నారాయణ రాజు  ప్రముఖ పాత్ర వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి రాజ్యసభ ఆమోదంతో ఘన విజయం సాధించిన అంశంలో తెలుగువాడి పాత్ర కూడా ఉండటంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణతోపాటు నాలుగు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు.

అత్యంత రహస్యంగా, పకడ్బందీ ప్రణాళికతో చేపట్టిన ఆ బిల్లు రూపకల్పనలో డా.జి సూర్యనారాయణది కీలక పాత్ర అని తెలుస్తోంది. శాసన వ్యవహారాల శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన గెజిట్ రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించారు. 

సీనియర్ లీగల్ సర్వీస్ ఆఫీసర్ అయిన నారాయణ రాజు 2015లో లెజిస్లేటీవ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన చట్టాల రూపకల్పనలో కీ రోల్ పోషిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుల రూపకల్పనలో ఆయనదే కీ రోల్. 

ఆర్టికల్ 370ని తమిళనాడుకి చెందిన గోపాలస్వామి అయ్యంగార్  రూపొందించగా ఆ చట్టం రద్దులో తెలుగు వ్యక్తి డా. జి.నారాయణ రాజు ఉండటం విశేషం. ఆర్టికల్ 370, 35-A రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ ని రెండు ముక్కలు చేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ ని విభజించారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ని చేశారు. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ని చేశారు.