విజయనగరం:  అందరూ చూస్తుండగానే ఓ యువతి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘోరం జరిగింది. బలవన్మరణానికి పాల్పడిన యువతి సచివాలయ ఉద్యోగిగా తెలుస్తోంది. 

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సీపట్నానికి చెందిన వెంకటరమణ-లక్ష్మి దంపతుల కూతురు రాజ్యలక్ష్మి విశాఖ సచివాలయంలో వెల్పేర్‌ అసిస్టెంట్‌గా పరిచేస్తోంది. ఆమె సోదరి మహాలక్ష్మి హైదరాబాద్ లో సీఏగా పని చేస్తోంది.  వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుర్లు మంచి ఉద్యోగాలు సాధించి సెటిలయ్యారన్న ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కూతురు రాజ్యలక్ష్మి విధులకు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది.  

శనివారం మద్యాహ్నం విజయనగరం రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం పైకి చేరుకుంది రాజ్యలక్ష్మి. ఈ సమయంలోనే  ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రావడంతో ఒక్కసారిగా పట్టాలపైకి దూకి రైలుకి ఎదురెళ్లి పట్టాలపై పడుకుంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అందరూ చూస్తుండగానే ఆమెపై నుండి రైలు దూసుకెళ్లింది. ఇలా రెప్పపాటులో అందరిఎదుటే రాజ్యలక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం తరలించారు. అనంతరం యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.