విశాఖపట్నం నగరంలోని ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో మరోసారి గ్యాస్ లీక్ అయినట్లుగా వస్తున్న వార్తలను ఏపీ పోలీస్ శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. అవన్నీ వదంతులేనని.. ఎవరూ కంగారుపడొద్దని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

పరిశ్రమలో మెయింటెనెన్స్ టీమ్ మరమ్మత్తులు చేస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొంత మొత్తంలో ఆవిరిని బయటకు పంపించేశారని, అక్కడ రెండోసారి ఎటువంటి గ్యాస్ లీక్ జరగలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Also Read:విశాఖలో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్

వదంతులపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. రెండోసారి గ్యాస్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఘటనా ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు.

కంపెనీలో గ్యాస్ లీక్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. ఆర్ వెంకటాపురం, బీసీ కాలనీల్లోని ప్రజలు సమీప శిబిరాల్లో క్షేమంగా ఉన్నారని అవంతి పేర్కొన్నారు.

Also Read:వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటన: కళ్లు తెరిచే లోగానే... చుట్టేసిన విషవాయవు

కాగా గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటనలో పది మంది మరణించగా.. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారికి ముఖ్యమంత్రి జగన్ కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.