విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయాల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 

గురువారం నాడు మధ్యాహ్నం కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షలు,ప్రాథమిక చికిత్స చేయించుకొన్నవారికి రూ. 25 వేలు, ఐదు బాదిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 10  వేలు ఆర్ధిక సహాయం అందించనున్నట్టుగా ఆయన తెలిపారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి సూచనల మేరకు చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు.  గ్యాస్ లీకేజీ కారణంగా జంతువులు మరణిస్తే ఒక్కో జంతువుకు రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు.అవసరమైతే ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయాలని కమిటి సూచిస్తే దానికి కూడ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొంటుందన్నారు.

also read:ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ప్రమాదం: ఎల్జీ ఫ్యాక్టరీ జీఎం

గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందన్నారు.పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి  సెక్రటరీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, విశాఖ నగర సీపీలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు..ఈ కమిటి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. 

ఎంజీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైన సమయంలో అలారం మోగాల్సిన అవసరం ఉందన్నారు. అలారం ఎందుకు మోగలేదనే విషయాన్ని తాను మనసు కూడ ప్రశ్నిస్తోందన్నారు.గ్యాస్ లీకైన ఘటనను దురదృష్టకరమైన ఘటనగా ఆయన పేర్కొన్నారు.  ఇవాళ ఉదయం 5 గంటలకు అంబులెన్స్ లు అందుబాటులో  వచ్చాయన్నారు. 

రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని  ఇక్కడే ఉండాలని సీఎం కోరారు. అదే విధంగా జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నబాబుతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు కూడ ఈ ప్రాంతంలోనే బాధితులకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.బాధితులకు ఎల్జీ కంపెనీలో ఉద్యోగాలను అందిస్తామని ఆయన ప్రకటించారు. 

అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని సీఎం చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 

అస్వస్థతకు గురైన వారు అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. 
ఘటనలో మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీ ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని చెప్పారు.