అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలనే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు వీడడం లేదు. స్థానిక పోరుపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాసినట్లు తెులస్తోంది.  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఆయన సోమవారం ఆ లేఖ రాశారు. 

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన ఆ లేఖలో తెలిపారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 17వ తేదీన జారీ చేసిన ప్రోసీడింగ్స్ ను ఆయన ఆ లేఖకు జత చేశారు. ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు ఈ నెల 3వ తేదీన ఇచ్చిన తీర్పును ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. 

ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోసం ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. తమకు కోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే లేఖ రాస్తున్నానని, ఎన్నికల సంఘం వినతిపై ప్రభుత్వం స్పందించి అవసమరై ఆర్థిక, ఆర్థికేతర సహకారం అందించాలని ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించిందని ఆ లేఖలో నిమ్మగడ్డ వివరించినట్లు సమాచారం. 

కోర్టు ఆదేశాలను వారు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆదేశాల అమలుపై 15 రోజుల లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కార్యదర్శిని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.