అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఆపాలంటూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎస్‍ఈసీ రమేశ్‍కుమార్ సూచించారు. ఈ మేరకు సీఎస్ కు ఆయన మంగళవారం లేఖ రాశారు.  

13 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ చేపట్టామని... కాబట్టి ఎన్నికలు పూర్తయ్యేవరకూ 13 జిల్లాలే కొనసాగించాలని ఎస్‍ఈసీ పేర్కొంది. జిల్లాల సంఖ్య పెంచడం వల్ల జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు  నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమయ్యింది. అప్పటివరకు జిల్లాల పెంపు ప్రక్రియ ఆపేయాలని ప్రభుత్వానికి సూచించింది ఎస్ఈసి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ రంగం సిద్దం చేసిన విషయం తెలిసిందే. గత కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక జీవో కూడా వెలువడింది.  ఇటీవలే జీవోలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇదివరకు నిర్ణయించినట్లుగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25 కు బదులు 26 కు పెంచే ఆలోచనలో ప్రభుత్వం వుంది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన జిల్లాల పెంపు కమిటీ జీవో లో మార్పులు చేసింది. 25 లేదా 26 జిల్లాల పెంపుపై కమిటీ అధ్యయనం చేస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఛైర్మెన్ గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, కమిటీ కన్వీనర్ గా ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మూడు మాసాల్లో ఈ కమిటీ  నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. 

పార్లమెంట్ నియోజకవర్గాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల నుండే నిరసన గళాలు వచ్చాయి. అయితే ఏ రకంగా జిల్లాలను ఏర్పాటు చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.