Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్ : ఫీజులు వసూలుకాక, అప్పులు తీర్చలేక.. స్కూలు నిర్వాహకుల ఆత్మహత్య..

పాఠశాల పెట్టినా.. ఫీజులు వసూలు కాకపోవడం, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా, కరోనా ప్రభావంతో బడి మూతపడడం.. అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడం వంటి కారణాలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

school owner couple suicide in kurnool
Author
Hyderabad, First Published Aug 16, 2021, 10:40 AM IST

కర్నూలు : కరోనా ఎన్నో జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. దాని ప్రభావంతో చనిపోతున్నవారు కొందరైతే... కరోనా ప్రభావం వల్ల జీవనోపాధి కోల్పోయి, ఎలా బతకాలో తెలియక ఇబ్బంది పడుతున్నవారు మరికొంతమంది. ఇంకోవైపు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. ఇదంతా మిగతా రంగాల మీదా ప్రభావాన్ని చూపిస్తోంది. 

కరోనాతో స్కూల్స్ మూతపడడం.. ఆన్ లైన్ క్లాసులు కావడంతో తల్లిదండ్రులు ఫీజులు సరిగా చెల్లించడం లేదు. దీంతో స్కూలు నిర్వహణ పెనుభారంగా మారిపోతోంది. అటు స్కూల్ కు పిల్లలు రాక, ఇటు ఫీజులు వసూలు కాక ఇబ్బందులు పడుతున్నారు. అలా చేసిన అప్పులు తలకు మించిన భారం కావడం, ఫీజులు వసూలు కాకపోవడంతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాదం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. 

పాఠశాల పెట్టినా.. ఫీజులు వసూలు కాకపోవడం, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా, కరోనా ప్రభావంతో బడి మూతపడడం.. అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడం వంటి కారణాలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు, కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33), కోడలు రోహిణి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

భార్యభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్రహ్మణ్యం, రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. 

ఆత్మహత్యకు ముందు ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ‘ఈ రోజు నేనూ, నా భార్య చనిపోతున్నాం. అందరూ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది... అంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సంచలనం కలిగించింది. 

విషయం తెలిసి జనం వారి ఇంటి వద్దకు చేరారు. సుబ్రహ్మణ్యం భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు. వారు ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యలో విష గుళికలు మింగారు. విషయం తెలుసుకున్న బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త మృతి చెందాడు. 

రోహిణిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. స్కూల్ కోసం సుమారు రూ.2 కోట్ల వరకు అప్పు చేసి ఉంటారని స్థానికులు తెలిపారు. ఇద్దరి మృతితో వారి కుటుంబీకులు రోధించడం అందరిన కలిచివేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios