ఆంధ్రప్రదేశ్ సర్వశిక్షా అభియాన్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. విద్యా శాఖ సమీక్షలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిని గుర్తించారు. స్కూల్ యూనిఫాంలో పేరుతో కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు దీనిలో భాగం ఉన్నట్లుగా సమాచారం. ఈ మేరకు ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీలో వార్తాకథనం ప్రసారమైంది.

ఆ వార్తాకథనం ప్రకారం.. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారులతో రోజుకొక సమావేశం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్.. గురువారం రోజు జరిగిన సమీక్షలో సర్వశిక్షా అభియాన్‌లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది.

జగన్ నివాసానికి వచ్చిన సర్వశిక్షా అభియాన్ అధికారి పూర్తి వివరాలతో కూడిన ఫైలును ముఖ్యమంత్రిగా అందజేశారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు యూనిఫాం అందించేందుకు గాను అప్కో నుంచి దుస్తులు కొనుగోలు చేశారు.

ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేలింది. దీనిపై స్పందించిన జగన్.. ఈ వ్యవహారంపై త్వరలో విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.