కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిగింది. 

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిగింది. పరిహారం చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కోవిడ్ మరణ పరిహారం చెల్లింపులు నెమ్మదిగా సాగడంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఎంఆర్ షా ధర్మాసనం సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. 

మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. న్యాయస్థానం ముందు అందరు సమానమేనన్న సుప్రీం ధర్మాసనం.. విచారణకు కచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కోవిడ్-19 మృతులకు రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ఎందుకు తక్కువగా పంపిణీ చేయబడుతుందో వివరించాలని సుప్రీంకోర్టు కోరింది. మరి దీనిపై వైఎస్ జగన్‌ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.

ఇక, కరోనాతో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిని విచారించిన సుప్రీం కోర్టు.. కరనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిహారం ఎంత అనే దానిపై తాము ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలని 
National Disaster Management Authority సిఫార్సు చేసినట్టుగా సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఇప్పటివరకు మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కొవిడ్‌-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని సుప్రీం కోర్టుకు ఆఫిడవిట్‌లో తెలియజేసింది

ఈ కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై మార్గదర్శకాలను కేంద్రం అని రాష్ట్రాలకు పంపింది. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కరోనా కారణంగా మరణించినట్లు ధ్రువీకరణ పత్రం తప్పనిసరని స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలు కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తున్నాయి.