కర్నూల్: బ్యాంకు రుణం చెల్లించనందుకు గాను ధాన్యాన్ని బహిరంగ వేలం వేస్తామని బ్యాంకు అధికారులు ప్రకటించారు.ఈ నెల 30వ తేదీన గోడౌన్లలో ధాన్యాన్ని వేలం వేసేందుకు ఎస్బీఐ అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ఎస్బీఐ అధికారులు ఈ నెల 30వ తేదీన వేలం వేయనున్నారు. 

కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతులు వేరుశనగతో పాటు ఇతర పంటల సాగు కోసం ఎస్బీఐ బ్యాంకుల రుణం తీసుకొన్నారు. వర్షాలు లేక కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు బ్యాంకుకు అప్పులు చెల్లించలేదు.

మరికొందరు రైతులు తమకు మద్దతు ధర లభించిన సమయంలోనే ధాన్యాన్ని విక్రయించాలని గోడౌన్లలో ధాన్యాన్ని ఉంచారు. అయితే అప్పులు చెల్లించాలని రైతులకు బ్యాంకుల నుండి నోటీసులు వచ్చాయి.

రైతులు మాత్రం తాము అప్పులు చెల్లించలేమని చేతులెత్తేశారు.ఈ తరుణంలో గోడౌన్లలో అప్పులు తీసుకొన్న రైతులు నిల్వ ఉంచిన ధాన్యాన్ని విక్రయిస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు పత్రికల్లో కూడ వేలం నోటీసులకు సంబంధించి యాడ్స్ ఇచ్చారు. ఈ నోటీసులు, వేలం ప్రకటనలను చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శనగ పంటను క్వింటాల్‌ కు కనీసం రూ. 6 వేలు చెల్లించాలని రైతులు  డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర లేని కారణంగా రైతులు ధాన్యం విక్రయం చేయకుండా గోడౌన్లలో నిల్వ ఉంచారు.

ఇదిలా ఉంటే రుణాలు తీసుకొని ఏడాది దాటినా రైతులు మాత్రం తిరిగి రుణాలు చెల్లించలేదు. ఏడాది దాటితే రుణాలు చెల్లించకపోతే  వేలం వేయాల్సిందేనని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.ఈ విషయమై వేలం నిలిపివేసే అధికారం తమ చేతుల్లో లేదని తమ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బ్యాంకు మేనేజర్ ప్రకటించారు.