అమరావతి: సరస్వతీ పవర్ లీజు వ్యవహారంలో తప్పుడు వార్తల ప్రచురించిన మీడియా సంస్ధలపై చర్యలు తీసుకోనున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా పలు మీడియా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నట్లు...పరువునష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 

ఈ విషయంలో తప్పుడు వార్తలపై 15  రోజుల్లో వివరణ కోరుతూ నోటీసులిచ్చామని అన్నారు. వారి నుండి సరైన వివరణ రాకపోతే మీడియా సంస్ధలపై పరువునష్టం దావా తప్పదన్నారు. ఈ పత్రికల కథనాలతో ప్రభుత్వం, గనులశాఖ పరువుకు నష్టం వాటిల్లిందని ద్వివేదిపేర్కొన్నారు. 

గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయ్యపాళ్యం గ్రామాల పరిధిలో సరస్వతి పవర్‌కు సున్నపురాయి గనుల లీజును పొడగిస్తూ వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు నాయుడు తప్పు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సరస్వతి పవర్‌ కంపెనీకి లీజును పునరుద్ధరించి.. పొడగింపు ఉత్తర్వులు ఇచ్చామంటోంది.

read more    సిగ్గుపడాల్సింది పోయి బెదిరిస్తున్నారు: విజయసాయి ఫైర్

సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మే 18,2009లో అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లకు 613 హెక్టార్లలో సున్నపురాయి తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత వివిధ కారణాలతో 2014లో ఈ లీజును రద్దు చేశాడు.

''లీజు రద్దు చేసిన తరువాత సరస్వతి పవర్‌ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ చేత బకాయిలు కట్టించుకొని లీజును పునరుద్ధరించాలని అక్టోబర్‌ 15, 2019 న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం డిసెంబర్‌ 12, 2019 సరస్వతి పవర్‌ లీజును పునరుద్ధరించాం. మైన్స్ ఆండ్  మినరల్స్ డెవలప్ మెంట్ రెగ్యులేషన్ యాక్ట్(ఎంఎండిఆర్) 2015 లోని  సెక్షన్ 8A(3) ప్రకారం ఇప్పటికే ఉన్న లీజులు 50 ఏళ్లకు పొడగించాలి. దాని ప్రకారం జూన్‌ 8, 2020న సరస్వతి పవర్‌ సంస్థకు లీజును పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం'' అని ఇప్పటికే గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు. 

‌