మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గ నియమితురాలైనప్పటినుండి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు సంచయిత గజపతిరాజు. తాజాగా కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు మద్ధతు పలికి మరో వివాదానికి తెర తీశారు. 

వివరాల్లోకి వెడితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు చట్టాలకు మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతి మద్దతు పలికారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అండతో మాన్సస్ పగ్గాలు చేపట్టిన సంచయిత కేంద్రానికి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. 

ఒకవైపు రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌ను జగన్ సర్కార్ సపోర్ట్ చేస్తుంటే, మరోవైపు ఆ రైతు చట్టాలకు మద్దతు పలకుతూ సంచయిత ట్వీట్ చేయడం విశేషం. ప్రతి మార్పు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, కానీ మంచి కోసమే ఆ మార్పు అని.. దాన్ని స్వాగతించాల్సిందేనని ట్విట్టర్‌ వేదికగా ఆమె చెప్పుకొచ్చారు. 

అంతేకాదు  రైతు చట్టాలు చరిత్రాత్మకమైనవి అన్నారు. వ్యవసాయ రంగానికి సంస్కరణలు చాలా అవసరమని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 

ఈ ట్వీట్‌పై ఇప్పటివరకు వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాకపోతే వారెలా స్పందిస్తారో చూడాలంటున్నారు విశ్లేషకులు. వైసీపీ మద్దతుతో మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ అయిన సంచయిత.. ఇలా ఈ స్టాండ్ తీసుకోవడం వెనకున్న కారణాలేంటనేది వేచి చూడాల్సిందే అంటున్నారు.