Asianet News TeluguAsianet News Telugu

వాళ్ల వల్ల కాలేదు.. నేను చేసి చూపిస్తా: అశోక్ గజపతిరాజుపై సంచయిత వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు

sanchaita gajapathi raju fires or tdp leader ashok gajapathi raju
Author
Simhachalam, First Published Jul 30, 2020, 5:14 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.

కేంద్రమంత్రిగా ఉండి కూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఏపీలో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రయత్నించలేదని సంచయిత నిలదీశారు

కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని ఆమె విమర్శించారు. నాటి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ వుంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా సంచయిత వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంచయిత.. మన్సాస్ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు.

ప్రసాద్ పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్, ఏపీ సీఎం జగన్, రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు, అప్పట్లో నిర్లక్ష్యం చేశారని సంచయిత మండిపడ్డారు.

సింహాచలం దేవస్థానంలో వృధాగా వున్న వేలాది ఎకరాల్లో ఈ పథకం కింద అభివృద్ధి చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీశారు. ఉత్తరాంధ్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలన్నారు.

అతి పురాతనమైన మోతీ మహాల్‌ని రాత్రికి రాత్రే కూల్చేశారని సంచయిత నిలదీశారు. ఇలాంటి పురాతన కట్టడాల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చే అవకాశం వున్నా కూడా ఎందుకు కూల్చేశారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్థానాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానన్నారు.

ప్రసాద్ పథకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతామని సంచయిత స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని.. తన పనితీరు ద్వారానే తనపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతానని ఆమె తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios